సంభాల్ విశేషమేంటో చెప్పిన యూపీ సీఎం యోగి
x

సంభాల్ విశేషమేంటో చెప్పిన యూపీ సీఎం యోగి

మందిర్-మస్జిద్ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో "వారసత్వాన్ని పునరుద్ధరించడం తప్పు కాదు," అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఇటీవలే మందిర్-మస్జిద్ వివాదాల సంఖ్య పెరుగుతుండడంపై ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాలపై స్పందించకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. వారసత్వాన్ని పునరుద్ధరించడం తప్పు కాదని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇండియా టుడే గ్రూప్ ఈవెంట్‌లో మాట్లాడిన యోగి.. మహా కుంభ మేళా ప్రారంభానికి ముందు సంభాల్‌లోని శాహీ జామా మస్జిద్ వివాదం గురించి మాట్లాడారు. "వారసత్వాన్ని పునరుద్ధరించడం తప్పు కాదు. ఇప్పుడు సంభాల్‌లో సనాతన ఆధారాలు కనిపిస్తున్నాయి. ముస్లిం లీగ్ మెంటాలిటీతో భారత్ నడవదు," అని పేర్కొన్నారు.

శాహీ జామా మస్జిద్‌పై సర్వే చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సంభాల్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. పురాణాలలో సంభాల్‌ను విష్ణువుకు పదో అవతారమైన కల్కి జన్మస్థలంగా పేర్కొన్నారని యోగి గుర్తుచేశారు.

మేళాతో కోట్ల ఆదాయం..

ఇక మహా కుంభ మేళా (Maha Kumbh Mela) గురించి యోగి (Yogi) మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించలేదని, ఈసారి మహా కుంభ మేళా ద్వారా కేంద్రానికి రూ. 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూర్చనుందని ప్రకటించారు.

ప్రయాగరాజ్‌లో డిజిటల్ మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "2019కి ముందు కుంభ మేళాకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ సారి భక్తికి ఆధునికత జోడించి భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశాం," అని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘2025లో జరిగే మహా కుంభ మేళా ఇంతకు ముందు మేళాలకంటే భిన్నంగా, అధ్బుతంగా ఉంటుంది. ఈసారి 40 కోట్లకుపైగా భక్తులు హాజరవుతారని ఆశిస్తున్నాం," అని యోగి వెల్లడించారు. మేళా సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మహా కుంభ నగరంలో రెండు రోజుల పర్యటించనున్నారు.

Read More
Next Story