
'స్టార్క్ సిస్టర్' పూర్ణిమకు ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్..
హర్‌గిలా(Hargila) సంరక్షణను మహిళా సాధికారతను ముడిపెట్టిన డా. పూర్ణిమా దేవి బర్మన్‌ను టైమ్ మ్యాగజైన్ 'వుమెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది.
హర్‌గిలా.. ఇది అసోం, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే అరుదైన కొంగ జాతి. 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పాటి రెక్కలున్న హర్‌గిలాలు.. పలు కారణాల వల్ల అంతరించిపోవడాన్ని డా.పూర్ణిమా దేవి బర్మన్ గమనించారు. దీంతో 20 ఏళ్లుగా వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. ఫలితంగా అస్సాంలోని గువాహటి, మోరిగావ్, నాగావ్ జిల్లాల్లో హర్‌గిలాల సంఖ్య 27 నుంచి 252కి పెరిగింది. ప్రస్తుతం మొత్తం అస్సాంలో వీటి సంఖ్య 1,800కి చేరుకుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బర్మన్ (Purnima Devi Barman) ‘ది ఫెడరల్’తో మాట్లాడారు. హర్‌గిలాల సంరక్షణ ఉద్యమంలో మహిళలను ఎలా భాగస్వామ్యం చేశారో వివరించారు. “ప్రారంభంలో హర్‌గిలాను అపశకునంగా భావించేవారు. కానీ గ్రామీణ మహిళల ఆలోచనా విధానాన్ని మార్చాలనుకున్నా. ఇందుకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా చూయించా’’ అని చెప్పారు.
హర్‌గిలా ఆర్మీ (Hargila Army)..
పట్టణాభివృద్ధి, చెట్లు నరికివేతతో హర్‌గిలాలు గ్రామాల్లోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయి. అయితే కొంగలు తమ పిల్లల ఆహారం కోసం జంతువుల అవశేషాలతో పాటు చెత్తను మోసుకొస్తుండడంతో గ్రామస్థులు తమ ఇళ్లలోని చెట్లను నరకడం మొదలుపెట్టారు. దాంతో అవి ఎటూ వెళ్లలేక అక్కడే చనిపోతుండడంతో వాటి సంరక్షణకు నడుం బిగించారు. గ్రామాల్లో హర్‌గిలాల గురించి అవగాహన పెంచేందుకు మొదట్లో మహిళలకు వంటల పోటీలు, ఆటలు పోటీలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాల చివర్లో ప్రకృతితో ప్రతి జీవికి పరస్పర సంబంధం ఉంటుందని చెబుతూనే.. హర్‌గిలాలను సంరక్షించాల్సిన అవసరం గురించి వివరించారు. దీంతో మాత్రమే సరిపెట్టకుండా.. మహిళలకు ఉపాధి అవకాశాలను కూడా చూపించారు. అసోం సంప్రదాయ దుస్తులు, టవల్స్ తయారు చేయడానికి వారికి కావాల్సిన సామగ్రిని అందించారు. ఈ దుస్తుల పైనా కొంగలకు సంబంధించిన బొమ్మలను చిత్రించేలా శిక్షణ ఇప్పించారు. ఈ దుస్తులు అక్కడికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకోవడంతో అక్కడి మహిళలకు మంచి ఉపాధి దొరికినట్లయింది. దాంతో వారికి ఆర్థిక స్వావలంబన దొరికింది. కొన్ని రోజులకు గ్రామస్థుల్లో మార్పు మొదలైంది. చెట్లు నరకడం తగ్గించేశారు. గూళ్ల నుంచి పడిపోయిన పిల్ల పక్షులను రక్షించారు. ఫలితంగా హర్‌గిలాల సంఖ్య క్రమేణా పెరగడం మొదలైంది.
అంతర్జాతీయ గుర్తింపు..
హర్‌గిలాల సంరక్షణకు కృషిచేసిన బర్మన్‌కు ఎన్నో అవార్డులు వరించాయి. 2022లో ఐక్యరాజ్యసమితి నుంచి ‘చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డు అందుకున్నారు. 2024లో ‘Whitley Gold Award’ అవార్డు కింద రూ. 1.09 కోట్ల నగదు అందుకున్న ఏకైక భారతీయురాలు బర్మన్. ఇటీవలే టైమ్ మ్యాగజైన్ పూర్ణిమాను వుమెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది.