
AIADMK రెబల్స్‌ను BJP సమీకరిస్తుందా?
అన్నాడీఎంకే బహిష్కృత నాయకుడు సెంగొట్టయన్ వ్యాఖ్యల్లో నిజమెంత? తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ కౌంటర్ ఏమిటి?
2026 అసెంబ్లీ ఎన్నికలు(Assembly polls) దగ్గర పడుతున్న తరుణంలో తమిళనాడు(Tamil Nadu) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు AIADMK బహిష్కృత నాయకులు DMKలో చేరిపోతున్నారు. ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో స్టాలిన్(CM Stalin) పట్టు పెరుగుతోంది. మరోవైపు అన్నాడీఎంకే మరో బహిష్కృత నేత సెంగొట్టయాన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. AIADMK రెబల్స్‌ను ఏకం చేయాలని బీజేపీ నేతలు తనను కోరుతున్నారని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
సెంగొట్టయన్‌ను బీజేపీ(BJP) వాడుకుంటుందా?
"పార్టీ వ్యతిరేక కార్యకలాపాల" కారణంగా సెంగొట్టయన్‌ను AIADMK నుంచి అక్టోబర్ 31న EPS బహిష్కరించారు. బహిష్కృత నేతలు OPS, AMMK చీఫ్ TTV దినకరన్, VK శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోవడం ద్వారానే పార్టీ బలం పుంజుకుంటుందన్నది సెంగొట్టయన్ చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ఈపీఎస్ దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఈ నేపథ్యంలో సెంగొట్టయాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరదీశాయి. బీజేపీ నాయకులు తనను అనేకసార్లు సంప్రదించారని, EPS నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని సమీకరించాలని తనను కోరారని చెప్పారు.
సెంగొట్టయాన్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వెంటనే ఖండించారు. ఎన్డీఏ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి డీఎంకేనే సెంగొట్టయాన్‌తో అలా చెప్పిస్తోందన్నారు. సెంగొట్టయాన్‌తో కలిసిన బీజేపీ నేతలెవరు? ఏం చర్చించారో తెలియాల్సి ఉందన్నారు.
AIADMK నుంచి డీఎంకేలోకి..
ఒకప్పుడు OPS నీడగా కనిపించిన మాజీ ఎమ్మెల్యే మనోజ్ పాండియన్ నవంబర్ 6న ముఖ్యమంత్రి MK స్టాలిన్ సమక్షంలో అధికార DMKలో చేరారు. ఫలితంగా తిరునెల్వేలి, దక్షిణ జిల్లాల్లో స్టాలిన్ పట్టు మరింత పెరిగింది. జయలలిత కాలం నాటి హెవీవెయిట్, ఎఐఎడిఎంకె మాజీ జాయింట్ కోఆర్డినేటర్ ఆర్ వైతిలింగం కూడా డీఎంకేలోకి రావడానికి మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. OPS వర్గీయులను తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు EPS ఇష్టపడకపోవడం వల్ల DMK వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ OPS మరోలా చెబుతున్నారు. "వైతిలింగం ఎప్పటికీ వేరే పార్టీలో చేరడు" అని అంటున్నారు.
ఎవరీ సెంగొట్టయన్ ?
సెంగొట్టయన్ రాజకీయానుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) అన్నాడీఎంకేను స్థాపించిన సమయంలో 1972లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 1975లో పార్టీ సర్వసభ్య సమావేశానికి కోశాధికారిగా కూడా వ్యవహరించారు. 1977లో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ నేతృత్వంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సెంగొట్టయన్.. తమిళనాడు రాజకీయాల్లో చాలాకాలంగా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఏఐఏడీఎంకే అధికారంలో ఉన్నప్పుడల్లా రవాణా, అటవీ, వ్యవసాయం, సమాచార, రెవెన్యూ శాఖలకు మంత్రిగా ఉన్నారు. జయలలిత, ఓ పన్నీర్‌సెల్వం తర్వాత పార్టీలో మూడో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా సెంగొట్టయన్‌కు పేరుంది. MGR మరణానంతరం పార్టీ ఐక్యంగా, బలంగా ఉండేందుకు జె. జయలలిత నాయకత్వం వహించమని ఒప్పించే బాధ్యత కూడా సెంగొట్టయన్ తీసుకున్నారు.

