బాబా సిద్ధిఖీ మర్డర్ కాంట్రాక్ట్ ఎందుకు మారింది?
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ మర్డర్ కాంట్రాక్ట్ ఎందుకు మారింది? ఆయన కొడుకు జీషన్ సిద్ధిఖీ ఫొటో నిందితుల ఫోన్లో ఎందుకుంది?
ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును లోతుగా విచారిస్తున్నాయి. సిద్ధిఖీని కాల్చిచంపిన నిందితుల్లో ఒకరి మొబైల్ ఫోన్‌లో ఆయన కొడుకు, ఎమ్మెల్యే అయిన జీషన్ సిద్ధిఖీ ఫొటో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని బాంద్రాలో అక్టోబర్ 12న సిద్ధిఖీని తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. కేసు విచారణ సందర్భంగా అరెస్టయిన నిందితుల్లో ఒకరి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తుండగా జీషన్ ఫొటో కనిపించింది.
స్నాప్‌చాట్ డిలిట్..
జీషన్ ఫొటోను నిందితులు స్నాప్‌చాట్ యాప్‌లో షేర్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన ఛాట్ సంభాషణలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసు అధికారులు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ మెంబర్ సూచన మేరకు ఛాట్ సంభాషణలను నిందితులు తొలగించినట్లు అనుమానిస్తున్నారు.
ఇప్పటి వరకు ఏడుగురి అరెస్టు..
బాబా సిద్ధిఖీని ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాలు సమకూర్చారన్న ఆరోపణతో నితిన్ గౌతమ్ సప్రే (32), శంభాజీ కిసాన్ పార్ధి (44), ప్రదీప్ దత్తు థోంబ్రే (37), చేతన్ దిలీప్ పార్ధి, రామ్ ఫుల్‌చంద్ కనౌజియా (43) అరెస్టు చేశారు. ముగ్గురు షూటర్లలో ఇద్దరు మాత్రం పోలీసులకు చిక్కారు. మరో షూటర్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
సిద్ధిఖీ మర్డర్ కాంట్రాక్టు ఎందుకు మారింది?
సిద్ధిఖీని చంపే కాంట్రాక్టు మొదట సప్రేతో పాటు తనకు ఇచ్చారని రాయ్‌గఢ్‌లోని పన్వెల్‌కు చెందిన కనౌజియా పోలీసులకు చెప్పాడు. అయితే ఆ పనిని తర్వాత ధర్మరాజ్ కశ్యప్, గుర్నైల్ సింగ్, శివకుమార్ గౌతమ్‌కు అప్పగించారని చెప్పాడు. మహారాష్ట్రలో బాబా సిద్ధిఖీ స్థాయి గురించి తమకు తెలియకపోవడం వల్లే కశ్యప్, గౌతమ్‌ను ఎంచుకున్నారని నిందితులు పోలీసులకు చెప్పారు. నేరం జరిగిన రోజునే కశ్యప్, సింగ్ అరెస్టు కాగా కానీ గౌతమ్ తప్పించుకున్నాడు.
2015 నుంచి జైల్లో ఉన్న బిష్ణోయ్ ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. పలు హత్యలు, దోపిడీ కేసుల్లో బిష్ణోయ్ పేరు కూడా ఉంది.