ఎన్నికల సమయంలోనే డేరాబాబాకు పెరోల్ ఎందుకు?
x

ఎన్నికల సమయంలోనే డేరాబాబాకు పెరోల్ ఎందుకు?

డేరాబాబా పెరోల్‌పై విడుదల కావడానికి, ఎన్నికలకు చాలా దగ్గర సంబంధమే ఉంది. ఈ సారి హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు బయటకు వచ్చారు.


‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ అలియాస్ డేరా బాబాకు షరతులతో కూడిన పెరోల్ మంజూరైంది. దీంతో రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి అక్టోబర్ 2న విడుదలయ్యారు. అయితే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనకుండా, ప్రసంగాలు చేయకుండా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండకూడదని ఎన్నికల అధికారి కండీషన్ పెట్టారు. దీంతో డేరా బాబా 20 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని తన ఆశ్రమంలో ఉండనున్నారు.

హర్యానా రాష్ట్రం సిర్సాలోని తన ఆశ్రమంలో 2017లో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 16 ఏళ్ల క్రితం జర్నలిస్టు హత్య కేసులో జీవిత ఖైదు విధించారు.

నాలుగేళ్లలో 11వ పెరోల్.. జైలులో గడిపింది 235 రోజులు..

గత నాలుగేళ్లలో డేరా బాబా పెరోల్‌‌పై బయటకు రావడం ఇది 11వ సారి. రెండు నెలల క్రితం ఆగస్టులో 21 రోజుల పాటు బయట ఉన్నారు. డేరాబాబా పెరోళ్లను లెక్కలోకి తీసుకుంటే.. ఇప్పటి వరకు ఆయన 235 రోజులు మాత్రమే జైలులో ఉన్నారు.

అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు..

యాదృచ్ఛికంగా, ఈ ఏడాది జనవరి 19న అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టోత్సవ కార్యక్రమానికి 3 రోజుల ముందు కూడా హర్యానా ప్రభుత్వం ఆయనకు 50 రోజుల పెరోల్ మంజూరు చేసింది. విడుదలైన వెంటనే దీపావళి మాదిరిగానే “రామ్ జీ పండుగ” జరుపుకోవాలని తన అనుచరులను కోరుతూ డేరాబాబా వీడియో రిలీజ్ చేశారు. ఇక 2023లో ఏకంగా మూడుసార్లు పెరోల్‌ పొందారు.

ఇక హత్యకు గురైన జర్నలిస్ట్ కుమారుడు అన్షుల్ ఛత్రపతి బీజేపీపై తన మండిపాటు వ్యక్తం చేశారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన ఖైదీల (తాత్కాలిక విడుదల) చట్టంను తీసుకొచ్చి డేరా బాబాకు పెరోల్ మంజూరు చేస్తోందని ఆరోపించారు.

అసలు పెరోల్ నిబంధనలేంటి?

చట్టం ప్రకారం.. సంవత్సరానికి 10 వారాలు (70 రోజులు) పాటు పెరోల్‌‌పై బయటకు రావొచ్చు. అదనంగా మరో మూడు వారాలు (21 రోజులు) పొందే వీలుంది. విడతల వారీగా కాకుండా 70 రోజులు ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది.

ఏ సందర్భంలో పెరోల్..

ఖైదీ అనారోగ్యానికి గురయినా లేదా కుటుంబ సభ్యుడు మరణించినా లేదా కుటుంబ సభ్యుడి వివాహానికి పెరోల్ పొందవచ్చు. అలాగే తన భార్యకు బిడ్డ పుట్టినా, వ్యవసాయ పనులకు, ఇంటి మరమ్మతులకు, కుటుంబసభ్యులను విద్యా సంస్థలో చేర్పించాల్సి వచ్చినపుడు కూడా పెరోల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోల్స్ అండ్ పెరోల్..

కానీ డేరాబాబా పెరోల్‌పై విడుదల కావడానికి, ఎన్నికలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఫిబ్రవరి 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ జైలు నుంచి రెండుసార్లు విడుదలయ్యారు. జూన్ 19న హర్యానాలోని 46 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగడానికి రెండు రోజుల ముందు 30 రోజుల పాటు పెరోల్‌పై బయటకువచ్చారు. నవంబర్ 2022లో హర్యానాలోని అడంపూర్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికకు ముందు నెల అంటే అక్టోబర్‌లో విడుదల చేశారు.

డేరాబాబాకు కోట్ల సంఖ్యలో అభిమానులు..

డేరా సచ్చా సౌదా చీఫ్‌కు హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌‌తో పాటు పొరుగు రాష్ట్రాలలో శాఖలున్నాయి. దేశంలో మిలియన్ల సంఖ్యలో అనుచరులున్నారు. వీరిలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వాళ్లే ఎక్కువ. వీరిలోనూ కూడా చాలా మంది దళితులే.

రాజకీయ పార్టీలతో అనుబంధం..

డేరాబాబా నాయకత్వంలోని సిర్సా బేస్డ్ డేరా సచ్చా సౌదా.. వివిధ సమయాల్లో కాంగ్రెస్, BJPకి మద్దతిచ్చింది. 2007 పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. అయితే హర్యానాలో 2014 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ తొలిసారిగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా డేరా బాబా పేరు ప్రస్తావించకుండానే మద్దతు ఇవ్వడంపై ప్రశంశలు కురిపించారు.

ఈ సారి హర్యానా ఎన్నికల వేళ..

BJP అభ్యర్థుల తొలి జాబితాలో రోహ్‌తక్‌లోని సునారియా జైలు మాజీ సూపరింటెండెంట్ సునీల్ సాంగ్వాన్ ఉన్నారు. సునీల్ సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం చర్కీ దాద్రి స్థానం నుంచి ఈయన పోటీచేస్తు్న్నారు. సునీల్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో డేరాబాబాకు ఆరు సార్లు పెరోల్ మంజూరయ్యింది.

ఉత్తరప్రదేశ్‌ ఆశ్రమంలో డేరాబాబా..

హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగానే డేరాబాబా పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పెరోల్ నిబంధనలు పాటిస్తున్న డేరా బాబా పెరోల్ సమయాన్ని ఉత్తరప్రదేశ్‌లోని తన ఆశ్రమంలో గడపనున్నారు. హర్యానాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందును హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అక్టోబరు 5న హర్యానా ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Read More
Next Story