
యూపీ ఎన్నికలు నితిన్ నబిన్ నాయకత్వానికి ఒక పరీక్ష?
2026లో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు కొత్త జాతీయ అధ్యక్షుడికి అతిపెద్ద సవాల్..
అతి చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీ(BJP)కి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్(Nitin Nabin) బాధ్యతలు చేపట్టడంతో "నూతన యుగం" ప్రారంభమైంది. ఇక ఆయన ముందున్న మొదటి సవాల్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు (Utter Pradesh Polls) జరగనున్నాయి. రాష్ట్రంలో బీజేపీని వరుసగా మూడోసారి అధికారంలోకి తేవడం కొత్త అధ్యక్షుడి ముందుగా అతిపెద్ద సవాల్.
మోదీ కొత్త 'బాస్'..
45 ఏళ్ల నబిన్ మంగళవారం (జనవరి 20) బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన పట్టాభిషేకానికి ప్రధాని మోదీతో పాటు పార్టీ అగ్ర నేతలు హాజరయ్యారు. నితిన్ నబిన్ నియామకాన్ని పార్టీలో కొంతమంది ఒక తరం మార్పుగా చూస్తున్నారు. "పార్టీ విషయాలలో నితిన్ నబిన్ జీ నా బాస్, నేను ఆయన కార్యకర్తను" అని మోదీ అన్న మాట.. నబీన్‌ను స్వాగతించడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల పార్టీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే కొత్త అధ్యక్షుడు సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూడటానికి ప్రజలు వేచిచూస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు..
బీజేపీ ప్రస్తుతానికి బలంగానే ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వం 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో విజయం సాధించడంలో బీజేపీ గణనీయ పాత్ర పోషించింది. అయితే 2026లో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు(Tamil Nadu), కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ భారతదేశంలోనూ వికసించాలన్నది బీజేపీ ఆంకాక్ష. అదే వ్యూహాంతో పార్టీ పనిచేస్తుంది. పార్టీ అధిపతిగా నబీన్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించాల్సి ఉండగా.. మోదీ - అమిత్ షా ద్వయం అధికార మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో నేరుగా నాయకత్వం వహించనున్నారు.
కీలకంగా యూపీ ఎన్నికలు..
2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలో ఉంది. మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ పార్టీ నేతలు ఊవిల్లురుతున్నారు. ఈ బాధ్యత ప్రస్తుతం నితిన్‌పైనే ఉంది. అయితే పార్టీని బలోపేతం చేయడం కొంతకష్టమేనని కొంతమంది అంటున్నారు.
ప్రతిపక్షాల PDA (పిచ్డా, దళిత్, ఆల్ప్సంఖ్యక్ - వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు) సమీకరణం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపింది. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి UPలో BJP కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, స్థానిక పార్లమెంటు సభ్యుల పట్ల అసంతృప్తి BJP ఓటమికి కారణాలు. రాష్ట్ర స్థాయిలో జట్టు నిర్మాణం నుంచి టిక్కెట్ల పంపిణీ వరకు నబిన్‌కు ప్రతీది పరీక్షే.
నబిన్‌కు కొత్త ..
జేపీ నడ్డా, అమిత్ షా జాతీయ అధ్యక్షులు కావడానికి ముందు యూపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల గురించి వారికి కొంత అవగాహన ఉంది. ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న అమిత్ షా రాష్ట్రంలో గెలుపు వ్యూహం రచించి పార్టీకి అధికారంలోకి తీసుకువచ్చారు.
అయితే కొత్త అధ్యక్షుడికి ఉత్తరప్రదేశ్‌పై పూర్తిగా అవగాహన లేదు. పైగా ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పంకజ్ చౌదరిని నియమించారు. ఆయనను కలుపుకునిపోతూ టిక్కెట్ల పంపిణీ వరకు నబిన్ పాత్ర అత్యంత క్రియాశీలకంగా ఉండబోతుంది. బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలను ఏకం చేయడం, వారి మనోధైర్యాన్ని పెంచడం నితిన్ ముందున్న మరో సవాలు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయ స్థాయి ఇటీవలి సంవత్సరాలలో పెరిగింది. అయితే అగ్ర నాయకత్వం, సంస్థతో విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సంస్థాగత పట్టును కొనసాగించే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఉంది. ప్రధాన నిర్ణయాలను ఆమోదించడంలో జాతీయ అధ్యక్షుడు పాత్ర కీలకం. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడంతో పాటు.. కార్యకర్తలను పార్టీ విజయానికి సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా నితిన్‌మీదే ఉంటుంది.

