
బీహార్: ఓటరు జాబితా పునఃసమీక్ష ఎందుకు వివాదాస్పదమైంది?
సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించిందేమిటి?
బీహార్(Bihar)లో ఓటరు జాబితా పునఃసమీక్షపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఆధార్, ఓటర్ కార్డు (EPIC), రేషన్ కార్డును గుర్తింపు పత్రాలుగా పరిగణించాలంటూ ఈసీని ఆదేశిస్తూ కేసును జూలై 28కి వాయిదా వేసింది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Elections) సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ ఓటరు జాబితాను పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియపై విపక్ష నాయకులు, కార్యకర్తలు, ఎన్జీవోలు, న్యాయవాదులు సుప్రీంకోర్టులో పదికి పైగా పిటిషన్లు వేశారు. ఈసీ నిర్ణయం సరికాదని వారి తరుపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆధార్ కార్డు కూడా తగిన ధృవీకరణ పత్రం కాదని ఈసీ పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘రాజ్యాంగం ప్రకారమే..’
ఎన్నికల సంఘం మాత్రం తాము రాజ్యాంగ బద్ధంగానే నడుచుకుంటున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల ముందు ఈ ప్రక్రియ చేపట్టాలని రాజ్యాంగంలో ఉందని గుర్తుచేస్తూ కోర్టుకు విన్నవించింది. ఈ ప్రక్రియ త్వరలో దేశమంతటా అమలులోకి వస్తుందని కూడా పేర్కొంది.
పిటీషనర్ జగదీప్ ఎస్ ఛోకర్ (Association for Democratic Reforms – ADR) ప్రకారం.. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు లాంటి పత్రాలను ఎన్నికల సంఘం ధృవీకరించే పత్రాలను పరిగణించే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.
‘ఆధార్‌కార్డును ప్రూఫ్‌గా పరిగణించండి’
ఎన్నికల ముందు ఇలాంటి ప్రక్రియ వల్ల నిజమైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు పిటీషన్లను విచారించిన న్యాయమూర్తులు సుధాన్షు ధూళియా, జయమాల్య బగ్గీ పేర్కొన్నారు. ఆధార్ కార్డును ధృవీకరణ పత్రంగా పరిగణించకపోతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి 2003లో బీహార్‌లో చివరిసారిగా ఓటరు జాబితా పునఃసమీక్ష (SIR) చేపట్టారు. అప్పటి నుంచి రాష్ట్రాలు ఏటా రివిజన్ చేసుకుంటూ వచ్చాయి.
‘ఇప్పటికే అన్నీ పూర్తిచేసింది’
ఓటరు జాబితా పున:సమీక్షకు సమయం సరిపోదని కొంతమంది అంటున్నారు. అయితే ఈసీ ఈ ప్రక్రియనే వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికే 77,895 బూత్ లెవల్ అధికారులను నియమించింది. మరో 20,603 మందిని శిక్షణకు సిద్ధం చేస్తున్నారని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి తెలిపారు.
SIR అమలు చేయడం అంటే ఒక రకంగా ఓటు హక్కుపై దాడి అని సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల కోట్లాది సామాన్య భారతీయులు ఓటు హక్కును కోల్పోవడమేనని పేర్కొన్నారు.
‘ఈసీ ఏం చెబుతోంది ?’
ప్రతి ఓటరు కొత్త ఫోటో, సంతకం, ప్రాథమిక సమాచారం, పౌరసత్వ రుజువుతో కూడిన 'ఎన్యూమరేషన్ ఫార్మ్'ను సమర్పించాలి. 2003 ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వారు (అదే పేరు, చిరునామా ఉంటే) జిరాక్స్ కాపీలు ఇవ్వడం ద్వారం ప్రస్తుతం ఓటరు జాబితాలో ఉన్న 4.96 కోట్ల మంది తమ అర్హతను నిరూపించుకుంటారు. ఇందుకు జూలై 25వ తేదీని చివరి గడువుగా పేర్కొంది.
కోర్టులో పిటీషన్లు..
ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బంద్‌నకు పిలుపునివ్వగా.. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ADR సంస్థ పిటిషన్లు దాఖలు చేసిన జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే 2024 అక్టోబర్ 29 నుంచి 2025 జనవరి 6 వరకు రాష్ట్రంలో “Special Summary Revision (SIR)జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. తరువాత వెంటనే మరో SIR ఎందుకని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ డీఎం దివాకర్ ఇలా అన్నారు..‘‘ఓటరు దారుడు తన బర్త్ సర్టిఫికేట్ చూపాలంటే కష్టం. కష్టాల్లో ఉన్న తరుణంలో వ్యవసాయ దారులను ఇలాంటి డాక్యుమెంట్లు కోరడం అసమంజసం, ’’ అని పేర్కొన్నారు. “చాలామంది ఓటర్లు బీహార్‌లో పుట్టినవారే. ఓటర్ల జాబితా నుంచి వారిని తొలగిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం కార్యక్రమాలకు వారు అనర్హులవుతారు. ఇది నిస్సందేహంగా పేదలకు వ్యతిరేక చర్య,” అని పేర్కొన్నారు.
రాజకీయ కారణాలున్నాయా?
అసలు రాజకీయ ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై అనేక ఊహాగానాలున్నాయి. ముఖ్యంగా బీహార్ సీమాంచల్ ప్రాంతాల్లోని పూర్నియా, కిషన్‌గంజ్, అరరియా, కతిహార్ జిల్లాల్లో ఉన్న అక్రమ బంగ్లాదేశీ వలసదారులను తొలగించాలన్న ఉద్దేశమే ప్రధాన ప్రేరణగా ఉన్నట్టు సమాచారం. బీజేపీ గత కొన్నేళ్లుగా ఇదే ఉద్యమాన్ని ముందుంచుతూ వచ్చింది. 2003లో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే ఈ ప్రక్రియ మొదలైంది. కానీ 2025లో మాత్రం అలాంటిదేమీ లేకుండానే ఈసీ నిర్ణయం తీసుకుంది.