
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చిన ఢిల్లీ సీఎం .. కారణమేంటి?
శీతాకాలంలో పెరిగిపోతున్న శ్వాస, చర్మ సంబంధ వ్యాధులు..
ఢిల్లీ(Delhi)లో వాయుకాలుష్యం(Air Pollution) రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకేసారి వాహనాల నుంచి అధిక మొత్తంలో వస్తోన్న పొగతో శ్వాస, చర్మ సంబంధ వ్యాధులు అధికమవుతున్నాయి. శీతాకాలంలో గాలి నాణ్యత బాగా పడిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(CM Rekha Gupta) కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త పనివేళలు..
అన్ని వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను తాత్కాలికంగా మార్చారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, మున్సిపల్ (MCD) కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. కొత్తగా మార్చిన పనివేళలు నవంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటాయని అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఎంసీడీ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తాయి. అయితే రెండు షెడ్యూళ్ల మధ్య కేవలం 30 నిమిషాల తేడా మాత్రమే ఉండడంతో.. ఒకేసారి వాహనాలు రోడ్లమీదకు వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ రద్దీతో పాటు వాయు కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్యాలయాల పనివేళలను మార్పు చేశారు. పర్యావరణ శాఖ అధికారులతో సమావేశమయిన తర్వాత ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త టైమింగ్స్ పక్కగా అమలు చేయాలని, ట్రాఫిక్, కాలుష్యం రెండింటినీ నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని అధికారులను ఆదేశించారు రేఖా గుప్తా. తాను తీసుకున్న ఈ చర్యల వల్ల ఢిల్లీవాసులకు కాలుష్యం నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

