శంకరాచార్యను వెనక్కు పంపిన అరుణాచల్ స్టూడెంట్స్
జగద్గురు అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ అరుణాచల్ ప్రదేశ్ ఎందుకెళ్లారు? అక్కడి విద్యార్థులు ఆయన్నిఎందుకు వెనక్కి పంపారు?
జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ దేశంలో గోహత్యలను అరికట్టాలని సంకల్పించారు. గౌ ధ్వజ్ యాత్ర (గోసంరక్షణ మార్చ్) పేరుతో అరుణాచల్ రాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. శంకరాచార్య ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ఎయిర్‌పోర్టులో చేరుకోగానే.. ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ (AAPSU) కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల గుమిగూడి ఆయన పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బలిజన్ ఎడిసి టకర్ రావా నేతృత్వంలోని పాపమ్ పారే జిల్లా యంత్రాంగం, డోనీ పోలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పి నరేంద్రన్ శంకరాచార్య వద్దకు చేరుకుని బయట పరిస్థితిని వివరించారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదని, శంకరాచార్యను ఎయిర్ పోర్టు విఐపి లాంజ్‌కి తీసుకెళ్లారు. శంకరాచార్య తాను యాత్ర చేపట్టి తీరతానని మొదట వారితో వాగ్వాదానికి దిగారు. అయితే అధికారులు పరిస్థితిని వివరించడంతో వెనక్కు తగ్గారు.
అరుణాచల్‌లో తప్పక పర్యటిస్తా..
“శంకరాచార్య మొదట్లో చాలా ఉద్రేకానికి గురయ్యారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాలని అనుకున్నారు. AAPSU కార్యకర్తలతో తాను మాట్లాడతానని చెప్పారు. శాంతిభద్రతలు విఘాతం కలుగుతుందని ఆయనకు నచ్చజెప్పాం. చివరకు ఆయన తిరిగి వెళ్లడానికి అంగీకరించారు. అయితే శంకరాచార్య అరుణాచల్‌కు తిరిగి వస్తానని చెప్పారు. భవిష్యత్తులో తన యాత్రను కొనసాగిస్తానని కూడా చెప్పాడు.” అని ఒక అధికారి తెలిపారు.
ఆయన ఎప్పుడైనా రావచ్చు..
అరుణాచల్ ప్రదేశ్‌కు రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని ఏడీసీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. “AAPSU వ్యతిరేకించడంతో ఆయన గౌ ధ్వజ్ యాత్రను ఆపేశాం. లేకపోతే ఆయనకు ఘనంగా స్వాగతం పలికేవాళ్లం. మేము శంకరాచార్యను మళ్లీ రమ్మని అభ్యర్థించాం. అందుకు ఆయన అంగీకరించారు.” అని రావా పేర్కొన్నారు.
ఆహారపు అలవాట్లలో జ్యోకం చేసుకోనివ్వం..
తమ యూనియన్ ఏ మతం, వ్యక్తి లేదా సంస్థకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు AAPSU ప్రధాన కార్యదర్శి రితుమ్ తాలి పేర్కొ్న్నారు. “ఆవు హిందువులకు పవిత్రమైనది. కానీ గిరిజనులకు ఇది సాధారణ ఆహారం. కాబట్టి అమాయక గిరిజనుల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని మేము అంగీకరించం” అని అన్నారు.
అవిముక్తేశ్వరానంద సరస్వతి ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠానికి శంకరాచార్య. స్వామి స్వరూపానంద సరస్వతి మరణానంతరం జ్యోతిష్ పీఠానికి కొత్త శంకరాచార్యగా నియమితులయ్యారు. ఆయన జ్యోతిష్ పీఠానికి 46వ శంకరాచార్యులు.