
పహల్గామ్ ఉగ్రదాడిలో 20 ఏళ్ల ఎల్ఈటీ టెర్రరిస్టు..
పాకిస్తాన్ సైన్యం నుంచి తొలగించడంతో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో చేతులు కలిపిన మూసా..
పహల్గామ్ (Pahalgam)ఉగ్రదాడిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) లోతుగా దర్యాప్తు చేస్తోంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26 మంది (Tourists) పర్యాటకులను కాల్చిచంపిన ఉగ్రమూకల్లో ఒకడయిన హషీమ్ ముసా(Hashim Musa)..ఒకప్పుడు పాకిస్తాన్(Pakistan) ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌లో మాజీ పారా కమాండోగా పనిచేశాడని NIA గుర్తించింది. సుమారు 20 ఏళ్ల వయసు ఉన్న మూసా ప్రస్తుతం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో కలిసి పనిచేస్తున్న కరడుగట్టిన ఉగ్రవాది అని తేల్చింది. పర్యాటకులపై దాడిచేయాలని ముసాను కశ్మీర్‌కు పంపింది కూడా ఎల్‌ఈటీనేనని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
అసలు మూసా ఎవరు?
పాకిస్తాన్ సైన్యం నుంచి తొలగించడంతో మూసా ఎల్ఈటీలో చేరాడని, 2024లో భారత్‌లో భద్రతా దళాలు, స్థానికేతరులపై జరిగిన మూడు దాడుల్లో మూసా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2023 సెప్టెంబర్‌లో కథువా, సాంబా సెక్టార్ నుంచి దేశంలోకి ప్రవేశించి, గత ఒకటిన్నర సంవత్సరాలుగా..కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని గుర్తించారు. పాకిస్తానీ ఉగ్రవాదులు ముసా, అలీ భాయ్ మరో ఇద్దరు స్థానికులు ఆదిల్ థోకర్, ఆసిఫ్ షేక్‌తో కలిసి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.
అయితే పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) ముసాను LeT(Lashker-e-Taiba)లో చేరమని ప్రేరేపించి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల గురించిన సమాచారం ఇచ్చిన వారికి కేంద్రం రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.