
‘భారత్‌కు కొత్త ముప్పు..వైట్-కాలర్ టెర్రరిజం’
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ వెల్లడి..
దేశంలో ఉగ్రవాద స్వరూపం మారుతోందని..తాజాగా “వైట్-కాలర్ టెర్రరిజం” (White-collar terrorism) అనే కొత్త ముప్పు ఎదురవుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్(Rajnath Singh) పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతులు, ప్రొఫెషనల్ నేపథ్యం ఉన్న వ్యక్తులు సైతం ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు బాంబు పేలుడు ఘటనను ప్రస్తావించారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ కేసులో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్ల భాగస్వామ్యం ఉన్నట్టు దర్యాప్తులో బయటపడిందని తెలిపారు. ఇది సంప్రదాయ ఉగ్రవాదానికి భిన్నమైన ధోరణి అని పేర్కొన్నారు. విద్య ఒక్కటే సరిపోదని, వ్యక్తుల్లో నైతిక విలువలు, బాధ్యతా భావం, దేశ పట్ల నిబద్ధత కూడా అవసరమని రాజనాథ్ సింగ్ సూచించారు. సరైన విలువలతో కూడిన విద్యా వ్యవస్థ లేకపోతే విద్యావంతులే తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ భద్రత పరంగా ఈ మార్పులను గమనిస్తూ..కొత్త తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే 15-20 ఏళ్లలో భారతదేశం ఆయుధాలలో పూర్తిగా స్వావలంబన సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, 2030 నాటికి మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రయాణంలో విశ్వవిద్యాలయాలు పెద్ద పాత్ర పోషించాల్సి ఉందని సింగ్ అన్నారు. కార్యక్రమంలో చిత్తోర్‌గఢ్ ఎంపీ సీపీ జోషి, నాథ్‌ద్వారా ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్, ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

