
విజన్ లు, ఊహలకు రెక్కలొస్తే...
ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్ తీర్మాణం, ఆకాంక్షలు, వాస్తవిక సవాళ్లు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్’ సంకల్ప తీర్మాణం ఏకగ్రీవంగా ఆమోదం పొందినా పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన ఈ తీర్మాణం, రాష్ట్రాన్ని రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధన, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి ఘనమైన లక్ష్యాలను నిర్దేశించింది. ‘వోకల్ ఫర్ లోకల్’ నుంచి ‘లోకల్ టు గ్లోబల్’ వరకు రెండు దశల అభివృద్ధి వ్యూహాలు, ప్రతీ ఇంటా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, ఎంఎస్ఎంఈలు, రైతులు, చేతివృత్తుల వారికి మద్దతు వంటి అంశాలు ఈ తీర్మాణంలో ప్రధానంగా ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధిని సాధించాలనే సామూహిక సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
తీర్మాణంలో ఊహాజనిత అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యం. ఏటా 15 శాతం స్థిరమైన వృద్ధి రేటు సాధన వంటివి అత్యంత ఆశావాద లక్షణాలు. ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి రేటు 10.50 శాతం ఉండగా, 15 శాతానికి చేరుకోవాలంటే భారీ పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలు, పాలసీల అమలు అవసరం. గత ప్రభుత్వాల్లో ఆర్థిక సమస్యలు, రాజధాని అమరావతి నిర్మాణ జాప్యం వంటివి ఇలాంటి లక్ష్యాలను సాధ్యం చేయడంలో అడ్డంకులుగా నిలిచాయి. మరోవైపు $42,000 తలసరి ఆదాయం సాధనకు స్థిరమైన ఎక్స్‌పోర్ట్స్, మాన్యుఫాక్చరింగ్ పెంపు అవసరం. కానీ గ్రామీణ ఉపాధి సమస్యలు, రైతుల ఆందోళనలు, MSMEల ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ ఈ లక్ష్యాలను సవాలుగా మారుస్తాయి.
ముఖ్యమంత్రి నాయుడు స్వర్ణ ఆంధ్ర-2047 విజన్‌తో రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని ప్రకటించారు. ఇది జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. రాష్ట్రాన్ని అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, తలసరి ఆదాయం పెంపు, స్థానిక పరిశ్రమల అభివృద్ధి వంటి లక్ష్యాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వాస్తవిక అమలు సవాళ్లు ఎన్నో ఉన్నాయి. విశ్లేషకులు ఈ తీర్మాణాన్ని ఆకాంక్షలు, వాస్తవికత మధ్య సమతుల్యత లేనిదిగా చూస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ తీర్మానం అంత గొప్పది కాదనే చర్చ జరుగుతోంది.
వోకల్ ఫర్ లోకల్ వంటి సూత్రాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ పోటీలో స్థానిక ఉత్పత్తులు నిలబడాలంటే నాణ్యతా ప్రమాణాలు, బ్రాండింగ్ మరియు ఇన్వెస్ట్‌మెంట్‌లలో భారీ మార్పులు అవసరం. ప్రస్తుత ఫిస్కల్ ఒత్తిళ్ల మధ్య ఇవి సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహం వంటి అంశాలు సాంస్కృతిక గౌరవాన్ని కాపాడేలా ఉన్నప్పటికీ, ఇవి కూడా ఊహాజనితంగానే మిగిలిపోతాయని విమర్శకులు అంటున్నారు. ఉదాహరణకు, స్వర్ణ ఆంధ్ర 2047 విజన్‌లో డీప్ టెక్ మరియు జీరో పావర్టీ లక్ష్యాలు ఆశావాదంగా ఉన్నాయి, కానీ అమలు కోసం స్థిరమైన ఫండింగ్ మరియు సమన్వయం అవసరం.
పాలిటికల్ మోటివేషన్ కూడా ఈ తీర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. NDA ప్రభుత్వం కేంద్ర లక్ష్యాలతో అనుసంధానం చేస్తూ ఈ సంకల్పాన్ని ముందుకు తెచ్చినప్పటికీ, ప్రతిపక్షాలు దీనిని మాటల హడావిడిగా విమర్శిస్తున్నాయి. గత TDP పాలనలో అమరావతి ప్రాజెక్టు వంటి ఆకాంక్షలు అర్ధంతరంగా ముగిసిన నేపథ్యంలో, ఈ తీర్మాణం కూడా అదే బాట పట్టకుండా ఉండాలంటే మాటలకు మించిన చర్యలు అవసరం. మరోవైపు, NITI ఆయోగ్ మీటింగ్‌లలో నాయుడు ప్రతిపాదించిన సబ్-గ్రూప్స్ వంటి ఆలోచనలు జాతీయ స్థాయిలో సమన్వయాన్ని ప్రోత్సహిస్తాయి, కానీ రాష్ట్ర లెవల్ అమలు సమస్యలు ఇంకా పరిష్కరించాలి.
ఈ తీర్మాణం ఆంధ్రప్రదేశ్‌ను వికసిత్ భారత్‌లో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్నాలజీ వంటి పది సూత్రాలతో కూడిన విజన్ రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీగా మార్చడంలో సానుకూల వాతావరణం కనిపిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే అమలు కోసం కేంద్ర-రాష్ట్ర సమన్వయం, ఫైనాన్షియల్ మద్దతు, గ్రాస్‌రూట్ లెవల్ ఎగ్జిక్యూషన్ అవసరం. ఊహాజనిత అంశాలను వాస్తవికతతో అనుసంధానం చేయకపోతే, ఇది మరో ప్రకటనగానే మిగిలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించి, చర్యలు తీసుకుంటే మాత్రమే వికసిత్ భారత్ సంకల్పం సార్థకమవుతుంది.
ఊహలకు రెక్కలొచ్చినట్లు: సీపీఐ
ఊహలకు రెక్కలు వస్తే ఎలా ఉంటుందో ఆత్మనిర్బర్ వికసిత్ భారత్ తీర్మాణం అలా ఉందని, ఊహల్లో బతకడం ఆంధ్ర పాలకులకు అలవాటుగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్ విమర్శించారు. ఇప్పటికే అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు మూడు లక్షల కోట్లకు పైన వచ్చే బడ్జెట్ ఉంటుందని చెప్పటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ విజన్ ఇప్పటికే చాలా చూశాం. ఇంకా విజన్ పాట పాడటం వల్ల ఉపయోగం లేదన్నారు.

