
బీహార్‌లో ప్రియాంక యాత్ర ఎప్పటి నుంచి? పేరేమిటి?
మహిళా ఓటర్లను రాబట్టుకునేందుకు హస్తం పార్టీ వ్యూహం..
బీహార్(Bihar)లో ఎన్నికల(Elections) హడావుడి మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించకముందే పార్టీలు ముమ్మర ప్రచారానికి తెరతీశాయి. ఆ వరుసలో మహాఘట్ బంధన్ కూటమి ముందువరుసలో ఉంది. ఇటీవలే లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (S.I.R)ను వ్యతిరేకిస్తూ ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ పేరుతో బీహార్‌లో విస్త్రతంగా పర్యటించారు. కాంగ్రెస్ భాగస్వా్మ్య పార్టీ, RJD నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) యాత్ర పూర్తయ్యే వరకు రాహుల్‌తో ఉన్నారు.
పాట్నాలో CWC మీట్..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని సెప్టెంబర్ 24న పాట్నాలో నిర్వహించనున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సీనియర్ పార్టీ నాయకులు హాజరుకానున్నారు. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా(Sonia) గాంధీ కూడా హాజరవుతారా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.
ప్రియాంక ‘హర్ ఘర్ అధికార్ యాత్ర’
బీహార్‌లో నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడుతోంది. రాహుల్ పర్యటన ప్రభావం బీహార్‌లో కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్న హస్తం పార్టీ..CWC మీట్ తర్వాత రోజు సెప్టెంబర్ 25న పార్టీ సభ్యులు, సీనియర్ నాయకులు పాట్నాలో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇక వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సెప్టెంబర్ 26న ఖగారియాలో ‘హర్ ఘర్ అధికార్ యాత్ర’ ను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖగారియా మైదానం నీటితో నిండిపోయింది. దాంతో ఆమె అక్కడి నుంచి యాత్రను ప్రారంభించే అవకాశం ఉండకపోవచ్చని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు.
"సెప్టెంబర్ 26న ర్యాలీకి సన్సార్‌పూర్ స్పోర్ట్స్ గ్రౌండ్ (ఖగారియాలో)ను మేం ఖరారు చేశాం. కానీ భారీ వర్షాల కారణంగా మైదానం పూర్తిగా నీటితో నిండిపోయింది. మైదానంలో తడి లేకుంటే ర్యాలీ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. లేదంటే తూర్పు చంపారన్‌లోని మోతీహారి నుంచి ర్యాలీ మొదలవుతుంది,’’ అని ది ఫెడరల్‌తో అన్నారు
మహిళా ఓటర్లే లక్ష్యంగా..
మహిళా ఓటర్లను మహా కూటమి వైపు తిప్పుకునేందుకు ప్రియాంకను రంగంలోకి దింపినట్లు కొన్ని పార్టీలంటున్నాయి. తన అన్నయ్య రాహుల్ కంటే ఎక్కువగా ఆకట్టుకునేలా ప్రియాంక మాట్లాడగలదు. అందుకోసమే ప్రియాంకను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ యాత్రలో కొన్ని గంటల పాటు ఇంటింటి ప్రచారం చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. కూటమి మ్యానిఫెస్టో గురించి కూడా ఆమె ఓటర్లను వివరించనున్నారు.
ఓటర్లతో ముఖామఖి..
అంగన్‌వాడీ సేవకులు జీవికా దీదీ సేవకులు (బీహార్ ప్రభుత్వ గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టులో చేరిన మహిళలు) సమస్యల గురించి ఆమె అడిగి తెలుసుకోనున్నట్లు పార్టీ నాయకుడు ఒకరు ది ఫెడరల్‌కు చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీ రెండింటికీ కీలక ఎన్నికల హామీ ‘మై బహిన్ మాన్ యోజన’ కింద మహిళలకు అందే ఆర్థిక సాయం గురించి ప్రియాంక ఎక్కువగా ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. పార్టీ సీనియర్లు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, భూపిందర్ హుడా, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య సహా పలువురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వేర్వేరు తేదీల్లో ప్రియాంక యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.