
శబరిమల యాత్రికులకు కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరిక ఏమిటి?
కేరళ శబరిమల యాత్రికుల కోసం వైద్య శిబిరాలు, హెల్ప్‌లైన్ ఏర్పాటు
కేరళ(Kerala)లో ఇటీవల బ్రెయిన్ ఫీవర్‌తో ముగ్గురు పిల్లలు చనిపోయారు. నదులు, చెరువుల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా బ్రెయిన్ ఫీవర్(brain fever)కు కారణమయ్యే అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. నవంబర్ 17 నుంచి శబరిమల(Sabarimala) వార్షిక తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యప్ప భక్తులు నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ సూచించింది. ప్రమాద రహిత తీర్థయాత్ర కోసం మార్గమధ్యంలో అక్కడక్కడా వైద్య శిబిరాలు, ఆరోగ్య కేంద్రాలను కేరళ ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం, ఇతర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ (04735 203232)ను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని, తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, కడిగిన పండ్లను తినాలని సూచించారు.
24 గంటలు పనిచేసే మెడికల్ షాపులు..
పండలం వలియా కోయిక్కల్ ఆలయంలో తాత్కాలిక డిస్పెన్సరీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అడూర్, వడస్సేరిక్కర, పతనంతిట్టలలో కనీసం ఒక మెడికల్ స్టోర్ 24 గంటలూ తెరిచి ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు ఆహార భద్రతా విభాగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆహార సంస్థలలోని సిబ్బందికి హెల్త్ కార్డులు తప్పనిసరి ఉండాలని చెప్పింది.
ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు..
పంప నుంచి సన్నిధానం వరకు ఉన్న మార్గంలో అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని, కొన్ని మెడికల్ కాలేజీ బేస్ హాస్పిటల్‌గా పనిచేస్తాయని వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. పతనంతిట్ట జనరల్ హాస్పిటల్‌లో అత్యవసర కార్డియాలజీ సేవలు, క్యాత్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులలో డీఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

