
'ఢిల్లీ ఎన్నికలలో ఓడిన కాంగ్రెస్ గురించి మాయమతి ఏమన్నారంటే..
బీఎస్పీ అధినేత్రి మాయావతి రాహుల్ గాంధీపై మరోసారి ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిజానికి బీజేపీ బీ-టీమ్‌లా వ్యవహరించిందని ఆరోపించారు.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయవతి రాహుల్ గాంధీపై ఫైరయ్యారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. "ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) బీజేపీ బీ-టీమ్‌గా వ్యవహరించిందనే చర్చ జరుగుతోంది. అందుకే కాషాయ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. లేదంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాలేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు," అని మాయావతి 'ఎక్స్' లో పోస్టు చేశారు.
రాహుల్‌కు మాయావతి సలహా..
రాహుల్ గాంధీ ఇతరులను విమర్శించేముందు ముందుగా తన పార్టీలోని సమస్యలను పరిష్కరించుకోవాలని మాయావతి హితవు పలికారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన 70 స్థానాల్లో 67 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ విజయం సాధించి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 10 ఏళ్ల పాలనకు తెరదించింది.
రాహుల్ వ్యాఖ్యలు..
దీనికి ముందు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో మాట్లాడుతూ.. బీఎస్పీతో పొత్తుకు తాను సిద్ధంగా ఉన్నా.. మాయావతి నుంచి సహకారం లభించలేదని అన్నారు. "నేను బహెంజీ (మాయావతి)ని కోరా. బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా కలిసి పనిచేద్దామని చెప్పా. కానీ ఆమె అంగీకరించలేదు. ఇది నాకు నిరాశను కలిగించింది," అని రాహుల్ అన్నారు. "మూడు పార్టీలూ కలిసి పోరాడిఉంటే బీజేపీ గెలిచే ఉండేది కాదు," అని ఆయన అభిప్రాయపడ్డారు.
మాయావతి ఘాటు స్పందన..
రాహుల్ వ్యాఖ్యలకు తక్షణమే మాయావతి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని, కులవివక్షతో వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. "కాంగ్రెస్ బలంగా లేదా అధికారంలో ఉన్న చోట బీఎస్పీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. కానీ బలహీనంగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లాంటి చోట బీఎస్పీతో పొత్తు గురించి మాట్లాడి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తుంది. ఇది కపట బుద్ధి కాకపోతే మరేంటి?" అని ప్రశ్నించారు.
బీఎస్పీ-కాంగ్రెస్ సంబంధాలు
ఒకప్పటి కీలక మిత్రపక్షాలుగా ఉన్న బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలు గత కొంతకాలంగా క్షీణించాయి. ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలో గతంలో కలిసి పనిచేసిన ఈ పార్టీలు, ఇటీవల ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీకి దిగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు కుదిరినా..బీఎస్పీ మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడింది.