మహారాష్ట్ర: కాంగ్రెస్ ఎందుకు సీట్లను వదులుకుంది ?
x

మహారాష్ట్ర: కాంగ్రెస్ ఎందుకు సీట్లను వదులుకుంది ?

మహ వికాస్ అఘాడీలో కాంగ్రెస్ చాలా సీట్లను వదులుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పుట్టిన ముంబైలో మొదట ఒక సీటును కేటాయించగా, తరువాత మరొకటి అదనంగా చేర్చారు..


ఎట్టకేలకు మహారాష్ట్రలో సీట్ల పంపకం కుదిరింది. కాంగ్రెస్, శివసేన(యుబిటి), ఎన్సీపీ(ఎంవిఏ) లత కూడిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఎ) అన్ని పంపకాలను పూర్తి చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మూడు స్థానాలను వదులుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఆశ పెట్టుకున్న మూడు స్థానాలైన దావా- సాంగ్లీ, భివాండీ, ముంబై సౌత్ సెంట్రల్ శివసేన, ఎన్సీపీ వర్గం ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించింది.

శివసేన (UBT) ఏకపక్షంగా చంద్రహర్ పాటిల్, అనిల్ దేశాయ్‌లను సాంగ్లీ , ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ప్రకటించగా, NCP (SP) భివాండి నుంచి తన అభ్యర్థిగా సురేష్ మ్హత్రే పేరును ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు, అయితే మిగిలిన రెండు మిత్రపక్షాలు దీనిపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో కాంగ్రెస్సే కిక్కురుమనకుండా ఊరుకుంది.

రాష్ట్రంలోని 48 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 17 సీట్లు మాత్రమే కేటాయించారు. శివసేన (యుబిటి) ఇప్పటికే 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఎన్‌సిపి (ఎస్‌పి) మిగిలిన 10 స్థానాలను కేటాయించింది. బీజేపీ కోటలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో శివసేన (UBT) ముంబై నార్త్‌లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. 1885 లో కాంగ్రెస్ ముంబైలోనే ఆవిర్భవించింది. అలాంటి కాంగ్రెస్ కు ముంబైలో కేవలం ఏకైక సీటు మిగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ దానికి ఒక్క సీటు మాత్రమే కేటాయించారు.

కాంగ్రెస్ మూలనపడింది

ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లతో చర్చలు జరపాలని మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ కేంద్ర నాయకత్వాన్ని అభ్యర్థించింది. అయితే పశ్చిమ బెంగాల్ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు బలమైన స్టాండ్ తీసుకోవడం కంటే పార్టీ లైన్‌లో పడాలని అనుకుంది. కూటమిలో కాంగ్రెస్‌ను ఒంటరి చేసేందుకు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి) రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని పార్టీలోని ఒక వర్గం నేతలు భావిస్తున్నారు.

"ఈ రెండు పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాయని, అందువల్ల మాకు అవి మరింత అవసరం అనే అభిప్రాయాన్ని సృష్టించాయి" అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మీడియాతో అన్నారు.కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. వారిలో కొందరు ఈ పరిస్థితికి మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కారణమని కొంతమంది రుసరుస లాడుతున్నారు.

అతను సరిగా చర్చలు జరపలేదని, పార్టీకి కావలసినన్ని సీట్లు సాధించడంలో విఫలమయ్యాడని ఆరోపించారు. అయితే, పటోల్ ఎలాంటి మాటలు మాట్లాడలేదు. మిత్రపక్షాల మధ్య చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి బదులు ఏకపక్షంగా సీట్లపై అభ్యర్థులను ప్రకటించడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.

ఈ రెండు పక్షాలు మహ వికాస్ అఘాడి కి చోదక శక్తిగా ఉండటమే కాకుండా, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని పార్టీ భావించి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ పరిణామాలు అంతమంచివి కావని కూడా వారి మాట. చాలా కాలం కిందటే శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి) నిలువుగా చీలిపోయాయి. కాంగ్రెస్‌లో బలహీనమైన రాష్ట్ర నాయకత్వం, అశోక్ చవాన్, మిలింద్ దేవరా వంటి కీలక నేతల వలసలు, పోరుబాట పట్టిన మిత్రపక్షాలు దీనికి ముడిపెట్టడం, పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోవడం వంటి అనేక అంశాలు కాంగ్రెస్‌లో దయనీయ స్థితికి దోహదపడ్డాయని వారు విశ్లేషిస్తున్నారు.

సాంగ్లీలో పరిస్థితి ఎలా ఉందంటే..

ఇదిలావుండగా, ఎంవిఎ సీట్ల పంపకం ఒప్పందం కుదుర్చుకున్న 24 గంటల్లోనే సాంగ్లీలోని స్థానిక కాంగ్రెస్ యూనిట్‌లో అసమ్మతి స్వరాలు వినిపించాయి.సాంగ్లీపై నిర్ణయాన్ని పునఃపరిశీలించమని సంకీర్ణాన్ని విజ్ఞప్తి చేస్తూ, స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గం తమకు బలమైన కోటగా ఉన్నందున సేన (యుబిటి) కంటే “సెగ్మెంట్‌లోని గ్రౌండ్ రియాలిటీస్” గురించి తమకు మంచి అవగాహన ఉందని వారు హై కమాండ్ కు నివేదించారు.

ఇదే సమయంలో మాజీ కేంద్రమంత్రి ప్రతీక్ పాటిల్, వంచిత్ బహూజన్ అఘాడి చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ మధ్య బుధవారం సమావేశం నిర్వహించారు. ఇక్కడి నుంచి తన తమ్ముడు విశాల్ పాటిల్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తుందని అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అయితే హఠాత్తుగా దీనిని సేనకు కేటాయించడంతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ తో సహ మిగిలిన నాయకులు విలేకరుల సమావేశం పెట్టి మరీ కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. . ప్రతీక్ మరియు విశాల్ ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ ప్రముఖుడు వసంతదాదా పాటిల్ మనవళ్లు.

లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 16 సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. వసంత్‌దాదా పాటిల్ ఒక టర్మ్ సీటును కలిగి ఉండగా, అతని మనవడు ప్రతీక్ పాటిల్ 2004 , 2009లో రెండుసార్లు గెలిచారు. 2014లో బిజెపికి చెందిన సంజయ్‌కాక పాటిల్ చేతిలో ఓడిపోయారు. తిరిగి పాటిల్ 2019లో సీటును నిలబెట్టుకున్నారు.గత లోక్‌సభ ఎన్నికల్లో స్వాభిమాని పక్ష అభ్యర్థిగా విశాల్ పాటిల్ పోటీ చేసి 3.44 లక్షలకు పైగా ఓట్లు సాధించారు.

సిట్టింగ్ ఎంపీ సంజయ్‌కాక పాటిల్‌పై అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో ఆయన పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఉంటే బీజేపీ నుంచి సీటు కైవసం చేసుకునేదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఠాక్రే ఈ సీటుపై తన వాదనను వినిపిస్తూ.. రెండుసార్లు మహారాష్ట్ర కేసరి విజేత అయిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా ప్రకటించారు, ఇది కాంగ్రెస్ నాయకులను కలవరపెట్టింది.నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సేన (యుబిటి)కి ఎమ్మెల్యేలు లేరు, కాంగ్రెస్‌కు ఇద్దరు - విశ్వజీత్ కదమ్ విక్రమ్‌సిన్హ్ సావంత్ ఉన్నారు.

ముంబై గందరగోళం

మరోవైపు, ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా పార్టీ వదులుకోవడంపై కూడా ముంబై కాంగ్రెస్ లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై సౌత్ సెంట్రల్ నుంచి శివసేన (యుబిటి) అభ్యర్థి అనిల్ దేశాయ్ కోసం పనిచేయవద్దని ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.ముంబయిలో కాంగ్రెస్‌కు కేటాయించిన రెండు స్థానాల్లో ఏ ఒక్క స్థానంలోనూ ఆ పార్టీకి బలమైన అభ్యర్థి లేరు.

ముంబై నార్త్ సెంట్రల్ సీటు కోసం గైక్వాడ్, మాజీ మంత్రులు నసీమ్ ఖాన్, సురేష్ శెట్టి, ముంబై కాంగ్రెస్ మాజీ చీఫ్ భాయ్ జగ్తాప్, ఏఐపీసీ రాష్ట్ర కార్యదర్శి మాథ్యూ ఆంథోనీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.ముంబై నార్త్‌కు, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం శివసేన (యుబిటి) మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్‌ను కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయమని కోరగా, ఆయన తిరస్కరించారు.

ఠాక్రే నేతృత్వంలోని సేనకు ఈ సీటు వస్తుందని విస్తృతంగా ఊహాగానాలు రావడంతో శివసేన అధినేత లోక్‌సభకు పోటీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.ముంబై నార్త్ సీటును ముంబై సౌత్ సెంట్రల్‌తో పాటు శివసేన (యుబిటి)తో మార్చుకోవాలని కాంగ్రెస్ భావించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. అయితే, ముంబై సౌత్ సెంట్రల్ నుంచి అనిల్ దేశాయ్ అభ్యర్థిగా శివసేన ఇప్పటికే ప్రకటించడంతో అది కష్టంగా కనిపిస్తోంది.

Read More
Next Story