
పీరియడ్స్ వస్తే తనిఖీ చేసి చూడాల్నా, ఇదేం ఘోరం?
రక్తపు మరకకే ఇంత రచ్చా? స్కూల్‌లో బాలికలపై అమానవీయ తనిఖీలు!
ఇంతకన్నా అమానుషం ఉంటుందా?.. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్య ఆగడాలకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలీ?.. ఆడపిల్లలకు పీరియడ్స్ అంటే నెలసరి వచ్చిందో తెలుసుకునేందుకు పిల్లల బట్టల్ని బలవంతంగా విప్పి చూడాల్నా? ఇదేం దారుణం.. అవును, మీరు వింటున్నది నిజమే... ఇంతటి అఘాయిత్యం మహారాష్ట్ర ఠాణే జిల్లాలో జరిగింది. షాహాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఉంది. దానిపేరు – ఆర్ ఎస్ దమానీ స్కూల్. ఆ స్కూల్లో ఈ దారుణం జరిగింది.
పరీక్షల సమయంలో 5 నుండి 10 వరకూ చదువుతున్న బాలికలను శారీరకంగా తనిఖీ చేశారు.. స్కూల్ టాయిలెట్‌లో రక్తపు మచ్చలు కనిపించాయని స్కూలు యాజమాన్యం ఈ చర్యకు దిగింది. దీనిపై బాలికల తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్ యాజమాన్యంతో పాటు సంబంధిత టీచర్లపై చర్యలు చేపట్టారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రకారం, స్కూల్ సమావేశాల హాలులో బాలికలందరినీ కూర్చోబెట్టారు. ప్రోజెక్టర్ ద్వారా టాయిలెట్‌లోని రక్తపు మచ్చల ఫోటోలు చూపించారు. "మీరు ఎవరైనా నెలసరి లో ఉన్నారా?" అని అడిగారు. ఈ తరవాత బాలికలను రెండు గ్రూపులుగా విభజించారు. నెలసరి లో ఉన్నామని చెప్పిన వారిని బొటనవేలు ముద్ర ఇవ్వమని కోరారు. మిగిలిన బాలికల్ని ఒక్కొక్కరిని టాయిలెట్‌కు తీసుకెళ్లి, ఓ మహిళా అటెండెంట్ వారి ప్రైవేట్ భాగాలను తనిఖీ చేశారు.
ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita - BNS) ప్రకారం కేసులు పెట్టారు. మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో దాడి లేదా శారీరక బలవంతం చేసినందుకు సెక్షన్ 74 కింద, మహిళను దుస్తులు తీయించే ఉద్దేశ్యంతో దాడి లేదా శారీరక బలవంతం చేసినందుకు సెక్షన్ 76 కింద, POCSO (Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసు నమోదు చేశారు. మొత్తం 8 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇంకా ఎవర్నీ అరెస్ట్ చేయలేదు.
ఈ చర్యను మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. చర్యలు, ఆందోళనలు పక్కనబెట్టినా అసలు ఇటువంటి ఆగడాలు ఏమిటీ, ఈ స్కూళ్లు ఏమి నేర్పిస్తున్నాయన్నది చాలా సీరియస్ ప్రశ్నగా ఉంది.
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల ఆగడాలకు అంతులేకుండా పోతోందని నెటిజన్లు విరుచుకుపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆగడాలకు పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story