అసెంబ్లీలో పేకాట ఆడితే ఆటల మంత్రి అవుతారా?
x
Maharashtra Minister Manikrao Kokate

అసెంబ్లీలో పేకాట ఆడితే ఆటల మంత్రి అవుతారా?

మహారాష్ట్రలో అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి మాణిక్ రావ్ కోకాటేకు క్రీడల శాఖ – ప్రతిపక్షాల మండిపాటు


అసెంబ్లీలో రమ్మీ ఆడితే ఆటల మంత్రి కావొచ్చా? ఇదేం విడ్డూరం అనుకుంటున్నారు కదూ.. అవును మీరు చదివింది నిజమే. మహారాష్ట్రలో అదే జరిగింది. అసెంబ్లీ మహారంజుగా సాగుతున్న సమయంలో మాణిక్ రావ్ కోకాటే అనే వ్యవసాయ శాఖ మంత్రి రమ్మీ ఆడుతూ కనిపించారు. అంతే ఆ చిత్రం దుమ్మురేపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో కూర్చొని రమ్మీ ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్‌ రావ్‌ కోకాటేపై వచ్చిన ఆరోపణలు (Rummy Row in Maharashtra) తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
మాణిక్ రావ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆయన మాత్రం ఏ మాత్రం చలించలేదు. సరిగ్గా ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. మాణిక్‌ రావ్‌పై వేటు వేయడానికి బదులు ఆయనకు క్రీడల శాఖను అప్పగించడం మరిన్ని విమర్శలకు దారితీసింది.
మహారాష్ట్రలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆఘమేఘాల మీద జరిగింది. గురువారం అర్ధరాత్రి ప్రకటన వెలువడింది. శుక్రవారం శాఖలు మారాయి. ఇప్పటివరకు మాణిక్‌ రావ్‌ కోకాటే (Manikrao Kokate) వ్యవసాయశాఖ మంత్రిగా ఉండగా.. తాజాగా ఆ బాధ్యతలను ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణెకు అప్పగించారు. మాణిక్ రావ్ కోకాటేకు క్రీడలు, యువజన సంక్షేమ మంత్రిత్వశాఖను కేటాయించారు. గతంలో ఈ శాఖను దత్తాత్రేయ పర్యవేక్షించారు. వివాదాస్పదమైన మంత్రిని తీసివేస్తారనుకుంటే శాఖ మార్చి సరిపెట్టారు. అయితే ఈ మార్పులపై కూడా రాష్ట్ర పాలకులు చెబుతున్న మాటేమిటంటే- తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమని చెప్పేందుకే ఈ మార్పు చేసినట్టు చెబుతున్నారు.
అసెంబ్లీ (Maharashtra Assembly)లో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించకుండా కేవలం శాఖను మార్చడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ‘‘ఇది జవాబుదారీతనం అనిపించుకోదు. కేవలం కంటితుడుపు చర్య మాత్రమే’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నేతలు మండిపడుతున్నారు. ఆయనకు క్రీడల శాఖను అప్పగించడం అంటే.. అసెంబ్లీలో రమ్మీ (Rummy Row) ఆడటాన్ని అధికారికంగా అనుమతించినట్లే అవుతుందని దుయ్యబట్టారు.
ఇటీవల ఎన్సీపీ (శరద్‌పవార్‌ వర్గం) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో మాణిక్‌రావ్‌ అసెంబ్లీ సమావేశాల్లో కూర్చొని ఫోన్లో రమ్మీ ఆడుతున్నట్లుగా ఉంది. ఇదికాస్తా వైరల్‌గా మారింది. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి ఇలా వ్యవహరించారని విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై మాణిక్‌రావ్‌ స్పందిస్తూ.. తనకు రమ్మీ ఆడటమే రాదన్నారు. ఈ ఆరోపణలపై తాను దోషిగా తేలితేనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
మరి మంత్రి మాణిక్ రావు అసెంబ్లీలో రమ్మీ ఆడినట్టు వీడియోలు ఎలా బయటకు వచ్చాయని అడిగితే అదంతా ఏఐ మహిమ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు.
Read More
Next Story