ముంబై మున్సిపాలిటీ: బీజేపీకి 137, శివసేన(షిండే)కు 90 స్థానాలు
x
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే

ముంబై మున్సిపాలిటీ: బీజేపీకి 137, శివసేన(షిండే)కు 90 స్థానాలు

బృహన్ ముంబై మున్సిపాలిటీ ఎన్నికల కోసం సీట్లు ఖరారు చేసుకున్న రెండు పార్టీలు


బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాలక మిత్రపక్షాలు అయిన బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు వరుసగా 137, 90 స్థానాలను పంచుకున్నాయి.

బృహన్ ముంబై మున్సిపాలిటీలో 227 వార్డులు ఉన్నాయి. వీటిలో మెజారిటీ సీట్లను బీజేపీ పోటీ చేయబోతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి డిసెంబర్ 30 కావడంతో ఒక రోజు ముందు రెండు పార్టీల మధ్య ముమ్మర చర్చలు జరిగాయి. తరువాత ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతం సోమవారం సీట్ల పంపకాల ఒప్పందాన్ని వెల్లడించారు.

రెండు పార్టీలు తమ తమ కోటాల్లోని కొన్ని సీట్లను తమ కూటమి భాగస్వాములకు కేటాయిస్తాయని అమిత్ ప్రకటించారు. రెండు పార్టీల అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు.

మహాయుతిలోని మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఎన్సీపీ ఇప్పటికే 64 మంది అభ్యర్థులను ప్రకటించింది.

మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జనవరి 15న జరుగుతాయి. వాటిలో ఒకటి కీలకమైన ముంబై కూడా ఉంది. జనవరి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

2017 లో జరిగిన ఎన్నికల్లో శివసేన కోట అయిన ముంబై మున్సిపాలిటిలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఏకంగా 82 స్థానాలు తన ఖాతాలో వేసుకోగలిగింది. శివసేన 84 సీట్లు సాధించింది.
కాంగ్రెస్ 31 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఎన్సీపీ 9, రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కు ఏడు సీట్లు దక్కాయి. ఎంఐఎం మూడు, సమాజ్ వాద్ పార్టీ ఆరు, అఖిల భారతీయ సేన ఒక స్థానం సాధించాయి. మిగిలినవి స్వతంత్రులు గెలుచుకున్నారు.
ఒంటరి అంటూ.. పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్..
ముంబై ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఒంటరిగా చేయాలనుకున్న నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంది. ఆదివారం ఆ పార్టీ ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ తో చేతులు కలిపింది.
దానికి 62 సీట్లు కేటాయించింది. వీబీఏతో పాటు రాష్ట్రీయ సమాజ్ పక్ష్(ఆర్ఎస్పీ)కి 10 స్థానాలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు రెండు స్థానాలు కేటాయించింది. ఇది పార్టీ శ్రేణులను కలవరపెట్టింది. ఇన్నాళ్లు శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ) వర్గాలతో జట్టు కట్టిన ఆ పార్టీ ఇప్పుడు వాటిని కాదని ఇతర చిన్న పార్టీలతో జట్లు కట్టింది.
ముంబై మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఉద్దవ్ ఠాక్రే- రాజ్ ఠాక్రే చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. మరోవైపు పిప్రి- చించ్ వాడ్ ఎన్నికల కోసం ఎన్సీపీ చీలిక పార్టీ అధినేతలు అయిన పవార్ కుటుంబం కూడా ఒక్కటయ్యాయి.


Read More
Next Story