West Bengal | బంగాళాదుంప రవాణా నిషేధం;  జార్ఖండ్, ఒడిశాలో పెరిగిన ధర
x

West Bengal | బంగాళాదుంప రవాణా నిషేధం; జార్ఖండ్, ఒడిశాలో పెరిగిన ధర

దేశంలో బంగాళాదుంపను అత్యధికంగా సాగే చేసే రాష్ట్రాలో మొదటిది ఉత్తరప్రదేశ్ కాగా.. పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది.


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక మార్కెట్లలో కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఈ సారి ఉత్పత్తి తక్కువగా ఉన్నందున తమ రాష్ట్రంలో పండించిన బంగాళాదుంపను పక్క రాష్ట్రాలకు తరలించకూడదని ఆదేశించారు. దీంతో పొరుగు రాష్ట్రాలయిన ఒడిశా, జార్ఖండ్‌లో బంగాళదుంప ధర పెరిగిపోయింది.

మమతా సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు..

బంగాళదుంప రవాణాపై నిషేధం విధించడంతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. పొటాటో మినహా ఇతర కూరగాయలను తీసుకొస్తున్న ట్రక్కులను పశ్చిమ బెంగాల్‌ పురూలియా జిల్లా సరిహద్దులో ఉన్న జార్ఖండ్ గ్రామాల ప్రజలు తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. బంగాళాదుంపను కూడా తెచ్చే వరకు ఇతర కూరగాయలను తమ రాష్ట్రంలోని అనుమతించమని నిరసనకారులు పట్టుబట్టారు. దీంతో టమోటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బెండతో వచ్చిన ట్రక్కులు పశ్చిమ బెంగాల్ సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. నవంబర్ మాసం చివర్లో ఈ నిషేధం విధించడంతో పొరుగు రాష్ట్రాల్లో కిలో బంగాళాదుంప రూ. 60కి పెరిగింది.

దుంపలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ..

జార్ఖండ్‌లోని గలుదిహ్, దుమ్కాకోచా, నార్సింగ్‌పూర్ గ్రామాల ప్రజలు.. పశ్చిమ బెంగాల్‌లోని తమకు దగ్గరున్న కూరగాయల మార్కెట్ల నుంచి బంగాళాదుంపలను కొని తమ రాష్ట్రానికి బయల్దేరారు. బంద్వాన్ చెక్‌పోస్టు వద్ద పశ్చిమ బెంగాల్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వారిని అడ్డుకుని బంగాళాదుంప సంచులను స్వాధీనం చేసుకున్నారు. ఇటు తమ వాహనాలను జార్ఖండ్ రాష్ట్రంలోకి అనుమతించనపుడు వారి వాహనాలను కూడా మా రాష్ట్రంలోని అనుమతించమని పశ్చిమ బెంగాల్‌లోని సాని గ్రామస్థులు పట్టుబట్టి అడ్డుకున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య కూరగాయల ట్రక్కులు ఆగిపోయాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు రంగప్రవేశం చేయడంతో వెనక్కు తగ్గారు.

బెంగాల్‌పై ఒడిశా ఆగ్రహం

బంగాళాదుంప సంక్షోభంపై ఒడిశా ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కృత్రిమ కొరతను సృష్టిస్తోందని ఒడిశా సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి బేచారం మన్నా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు నిలిపేసి మమతా బెనర్జీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నది ప్రధాని మోదీయేనని సమాధానమిచ్చారు. ‘‘మాకు సరిపడా ఉన్నప్పుడే ఇతర రాష్ట్రాలకు బంగాళాదుంప సరఫరా చేస్తాం. దురదృష్టవశాత్తూ డానా తుఫాను ప్రభావంతో ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గింది.” అని మన్నా చెప్పారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి రోజు దాదాపు 18,000 టన్నుల బంగాళాదుంపలు అవసరం. ఒక్క కోల్‌కతాలోనే రోజుకు దాదాపు 5,000 టన్నులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.2 లక్షల టన్నులు నిల్వ ఉంది. ఇవి 40-45 రోజులకు మాత్రమే సరిపోతుంది. కొత్త పంట మార్కెట్‌లోకి వచ్చేంత వరకు మేం జాగ్రత్త పడక తప్పదు.’’ అని పేర్కొ్న్నారు.

ప్రభుత్వంతో విభేదిస్తున్న వ్యాపారులు

ప్రస్తుతం కోల్‌కతాలో కిలో బంగాళదుంప రిటైల్ ధర రూ.35 నుంచి రూ. 40 పలుకుతుంది. పశ్చిమ బెంగాల్ బంగాళాదుంప వ్యాపారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా భయపడుతోందని అంటున్నారు. “రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో మాకు అర్థం కావడం లేదు. మనం 2 నుంచి 2.5 లక్షల టన్నుల బంగాళదుంపలను ఇతర రాష్ట్రాలకు సులభంగా రవాణా చేయవచ్చు. దాదాపు 4 లక్షల టన్నుల నిల్వ రాష్ట్ర అవసరాలకు సరిపోతుంది. ఈ విషయాన్ని అధికారులకు వివరించి ఒప్పించడంలో విఫలమయ్యాం” అని ప్రోగ్రెసివ్ పొటాటో ట్రేడర్స్ అసోసియేషన్ కార్యదర్శి లాలూ ముఖర్జీ పేర్కొన్నారు.

Read More
Next Story