‘పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దీర్ఘకాలం’
x

‘పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దీర్ఘకాలం’

దేశం సన్నద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన..


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. రాబోయే కాలాన్ని దేశానికి “పరీక్షాకాలం”గా అభివర్ణించిన ఆయన.. ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మంగళవారం రాజ్యసభలో ప్రసంగించిన మోదీ, యుద్ధ ప్రభావం ఇంధనం, వాణిజ్యం, జీవనోపాధులపై తీవ్రంగా పడే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా కార్మికులు, బలహీన వర్గాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని, వారికి రక్షణ కల్పించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘అప్రమత్తంగా వ్యవహరించాలి’

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాని సూచించారు. అవసరమైన వస్తువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, నల్లబజారు కార్యకలాపాలను కట్టడి చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే వలస కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఇంధనం, వాణిజ్యంపై ప్రభావం..

పశ్చిమాసియా పరిస్థితుల వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు దెబ్బతిన్నాయని ప్రధాని పేర్కొన్నారు. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా, అలాగే ఎరువుల సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని ఆయన అన్నారు.

విదేశాల్లో భారతీయుల భద్రత..

గల్ఫ్ దేశాల్లో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తూ పనిచేస్తున్నారని గుర్తుచేసిన ప్రధాని, వారి భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలు నిలిచిపోవడం వల్ల భారతీయ సిబ్బంది చిక్కుకుపోయిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

తరలింపు చర్యలు:

యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించే చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 3.75 లక్షల మందికి పైగా భారతీయులను స్వదేశానికి తరలించగా, అందులో ఇరాన్ నుంచే 1,000 మందికి పైగా ఉన్నారని చెప్పారు. వీరిలో 700 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.

దౌత్యపర యత్నాలు..

ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం భారత్ చురుకుగా ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని వెల్లడించారు. గల్ఫ్ దేశాలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. యుద్ధం విస్తరించకుండా నిరోధించడం, చర్చల ద్వారా పరిష్కారం సాధించడం లక్ష్యమని చెప్పారు.

దేశ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హామీ ఇచ్చిన ప్రధాని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే పరిస్థితులు క్లిష్టంగా మారే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

Read More
Next Story