
‘బీహార్‌లో తయారయ్యే షెల్స్ ఉగ్రవాదులపై ప్రయోగిస్తాం’
కాంగ్రెస్, ఆర్జేడీ చొరబాటుదారులను ప్రోత్సహిస్తుందన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ మధ్య నాలుగు రోజుల సైనిక పోరాటం గురించి నేరుగా ప్రస్తావించకుండా.. ప్రధాని మోదీ(PM Modi) ప్రకటించిన బీహార్‌లోని ప్రతిపాదిత రక్షణ కారిడార్‌లో తయారయ్యే షెల్స్(shells)ను ఉగ్రవాదులపై ప్రయోగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) శనివారం (నవంబర్ 8) అన్నారు.
బీహార్‌లో తొలి దశ పోలింగ్ గురువారం (నవంబర్ 6వ తేదీ) పూర్తయ్యింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 11వ తేదీ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం షా కతిహార్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు.
‘ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవు..’
మహాఘట్‌బంధన్ కూటమిపై అమిత్ షా ధ్వజమెత్తారు. వంశపారంపర్య రాజకీయాలపై మండిపడ్డారు. ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress) పార్టీలు తమ పిల్లలు, కుటుంబ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నాయని విమర్శించారు. తన కుమారుడు తేజస్వి యాదవ్(Tejashwi Yadav) ముఖ్యమంత్రి కావాలని లలూ కోరుకుంటున్నారని, అలాగే రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానిగా చూడాలని సోనియా ఆశపడుతున్నారని చెప్పారు. అయితే ఆ రెండు పోస్టులు నితీష్ కుమార్, నరేంద్ర మోదీతో భర్తీ అయ్యాయని పేర్కొన్నారు.
'చొరబాటుదారులకు సాయం చేస్తున్నారు'
సుపాల్‌లో జరిగిన మరో ర్యాలీలో షా మాట్లాడుతూ..చొరబాటుదారులను రక్షించడానికి రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించగా.. మహాఘట్‌బంధన్ చొరబాటుదారులకు సాయం చేస్తోందని ఆరోపించారు. అంతకుముందు రోజు పూర్ణియా, కతిహార్‌లో జరిగిన ర్యాలీలలో షా ప్రసంగించారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతాన్ని "చొరబాటుదారుల నిలయంగా" మార్చాలని ఆరోపించారు. ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించిన తర్వాత కేంద్రం అక్రమ వలసదారులందరినీ గుర్తించి బహిష్కరిస్తుందని చెప్పారు.
‘160 స్థానాలు మావే..’
బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లో 160కి పైగా స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంటుందని షా ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశ పోలింగ్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ఓటర్లు తిరస్కరించారని చెప్పారు.

