‘పాక్‌తో అంతవరకు చర్చలుండవు’
x

‘పాక్‌తో అంతవరకు చర్చలుండవు’

ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం (సెప్టెంబర్ 22) తేల్చి చెప్పారు.


ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం (సెప్టెంబర్ 22) తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రిజర్వేషన్లను అంతం చేయడానికి గాంధీ, అబ్దుల్లా కుటుంబాలు చేతులు కలిపాయని ఆరోపించారు.

'మొహబ్బత్ కీ దుకాన్' బంద్..

"అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు తర్వాత మీ 'మొహబ్బత్ కీ దుకాన్' మూతపడుతుందని షా అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో 'నఫ్రత్ కే బజార్ మే, మొహబ్బత్ కీ దుకాన్' నినాదాన్ని తరచుగా ఉపయోగించేవాడు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఉగ్రవాదులతో 'బిర్యానీ' తిన్న మూడు కుటుంబాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. జె-కె బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనాకు మద్దతుగా సెప్టెంబర్ 25న ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

ఆర్టికల్ 370ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరు..

‘‘జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ అధికారం వచ్చాక ఆ ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని ఫరూక్‌ అబ్దుల్లా చెబుతున్నారు. ఏ శక్తీ దాన్ని తిరిగి తీసుకురాలేదు.’’ అని చెప్పారు.

ఎప్పటికీ అలా జరగదు..

‘‘కొందరు పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ, ఉగ్రవాదం అంతమయ్యే వరకు వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదు. దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) కోరుకుంటున్నారు. కానీ, మోదీ సర్కార్‌ అలా ఎన్నటికీ చేయదు. భారత ప్రజలపై రాళ్లు రువ్విన వారికి కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదు’’ అని షా మరోసారి స్పష్టం చేశారు.

జమ్ము కాశ్మీర్‌లో సెప్టెంబరు 18న తొలి దశ ఎన్నికలు జరిగాయి. రెండో విడత ఎన్నికలు సెప్టెంబరు 25న జరగనున్నాయి.

Read More
Next Story