అమెరికా అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు
x

అక్రమ వలసదారులతో పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలీవాల్

అమెరికా అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు

అమెరికా అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు (Handcuffs).. కాళ్లకు గొలుసులు వేసి విమానం ఎక్కించి ఇండియాకు తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.


జస్పాల్ సింగ్.. నిన్న టెక్సాస్ నుంచి పంజాబ్‌కు విమానంలో తీసుకువచ్చిన 104 మంది అమెరికా అక్రమవలసదారుల్లో ఒకరు. పంజాబ్‌లోని గురుదాస్పూర్ జిల్లా హర్దోర్వాల్ గ్రామ నివాసి అయిన 36 ఏళ్ల సింగ్..జనవరి 24న సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్న సమయంలో యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ దళాలకు దొరికిపోయాడు. ఇండియాకు తీసుకురావడానికి ముందు చేతులకు బేడీలు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేసి విమానంలో ఎక్కించారని తెలిపారు. ఫ్లైట్ ల్యాండ్ కాగానే వాటిని తొలగించి పంపించారని చెప్పారు.

హామీని అమల్లో పెట్టిన ట్రంప్..

తాను అధికార పగ్గాలు చేపడితే..అక్రమ వలసదారులను తరిమేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. పవర్‌లోకి రాగానే ఆ వాగ్ధానాన్ని అమలులోకి తెచ్చారు. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న వారిపై నిఘా ఉంచారు. జాబితా కూడా సిద్ధం చేశారు. సుమారు 18వేల మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరిని విడతల వారీగా ఇండియాకు పంపేందుకు అమెరికా ఏర్పాట్లు కూడా చేస్తోంది. మొదట విడతగా 104 మందితో బుధవారం టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకుంది.

అక్రమ వలసదారుల్లో 19 మంది మహిళలు.

104 మందిలో హర్యానా, గుజరాత్‌ రాష్టాలకు చెందినవారు 66 మంది, పంజాబ్‌కు చెందిన 30 మంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు చండీగఢ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిలో 19 మంది మహిళలు, 13 మంది చిన్నారులు ఉన్నారు. విమానం దిగిన తర్వాత పంజాబ్‌కు చెందిన అక్రమవలసదారులను అక్కడి పోలీసులు వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు.

ఏజెంట్ చేతిలో మోసపోయా..

బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్న జస్పాల్.. తాను ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘"నన్ను చట్టబద్ధంగానే అమెరికా పంపించాలని ఏజెంట్‌ను కోరాను. అలాగేనని చెప్పి ఏజెంట్‌ నా నుంచి రూ. 30 లక్షలు తీసుకున్నాడు. ఏజెంట్ చెప్పినట్లుగా గతేడాది జూలైలో విమానంలో బ్రెజిల్‌కు చేరుకున్నా. అక్కడి నుంచి అమెరికాకు మరో విమానంలో వెళ్లాలని చెప్పాడు. వీలుకాక ఆరు నెలలు బ్రెజిల్‌లో గడిపాను. ఏజెంట్‌ను ఒత్తిడి చేయడంతో అక్రమంగా సరిహద్దు దాటి వెళ్లాలని బలవంతం చేశాడు. అలా అమెరికా భూభాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది నన్ను అరెస్టు చేశారు. 11 రోజులపాటు అమెరికా పోలీసుల అదుపులో ఉన్నా,’’ అని వివరించాడు జస్పాల్.

విమానం ఎక్కేదాకా ఇండియాకు తీసుకెళ్లుతున్నారన్న విషయం తెలియదని జస్పాల్ చెప్పారు. "మమ్మల్ని మరో చోటికి తరలిస్తు్న్నారని అనుకున్నాం. కానీ ఒక పోలీస్ అధికారి మమ్మల్ని ఇండియాకు పంపుతున్నట్లు చెప్పాడు. చేతులకు వేసిన సంకెళ్లను, కాళ్లకు వేసిన గొలుసును అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్నాక తొలగించారు," అని జస్పాల్ చెప్పారు.

అమెరికాలో ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నా కల కలగానే మిగిలిపోయిందని జస్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Next Story