లోక్‌సభలో స్పీకర్ తీరుపై రాహుల్ అసహనం
x

లోక్‌సభలో స్పీకర్ తీరుపై రాహుల్ అసహనం

లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రతిపక్ష నేత రాహుల్ ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? ఆయన ఏం అంశంపై చర్చకు పట్టుబట్టారు?


NEET పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నిర్మాణాత్మక చర్చకు లోక్ సభలో స్పీకర్ అనుమతించకపోవడంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ వేదికగా “పేపర్లు లీక్ అయ్యాయని అందరికీ తెలుసు. డాక్టర్లు కావాలని చదివిన విద్యార్థుల కలలు, ఆకాంక్షలు అపహాస్యం పాలయ్యాయి.’’ అని రాహుల్ పేర్కొన్నారు.

NEET గురించి మాట్లాడాలని రాహుల్ పట్టుబట్టినపుడు ఆయన మైక్ "మ్యూట్" చేశారని కాంగ్రెస్ పేర్కొంది.

సభను వాయిదా వేసిన స్పీకర్..

NEET నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చర్చించాలని సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దాంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయినపుడు NEETపై చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అనంతరం చర్చిద్దామని ప్రతిపక్ష సభ్యులకు తెలిపారు.

NEETని మే 5న NTA నిర్వహించింది. ఇందులో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. పరీక్షకు ముందే ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్ రాష్ట్రంలో పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. 17 మందిని అరెస్టు చేశారు.

Read More
Next Story