
VB-G Ram G పథకం ఎప్పుడైనా రద్దు కావచ్చు’
125 రోజుల పనికి హామీ ఎక్కడని ప్రశ్నిస్తోన్న డీఎంకే..
భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్తగా వికసిత్ భారత్- జి రామ్ జి (G RAM G) బిల్లు తీసుకువచ్చింది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా(వికసిత్ భారత్ 2047) మార్చాలన్నద్దే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. 125 రోజుల పాటు ఉపాధి పనులు కల్పించే VB-G RAM G బిల్లును ఇటీవల పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే.
అయితే తమిళనాట ఈ బిల్లుపై డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కొత్త బిల్లులో మొత్తం 125 రోజుల పనికి ఎలాంటి హామీ ఇవ్వలేదని డీఎంకే అంటోంది. ఏ సమయంలోనైనా పథకాన్ని నిలిపేసేలా బిల్లు రూపొందించారని ఆరోపించింది. అంతకుముందు పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై సీఎం స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేపిన విషయం తెలిసిందే. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ఒక్కటే సమస్య కాదని డీఎంకే అధికార పత్రిక 'మురసోలి' పేర్కొంది. గాంధీజీ పేరును తొలగించడం వల్ల ఆయన ప్రతిష్ట ఏ విధంగానూ భంగం కలుగదు. వాస్తవానికి ఆయన పేరును తొలగించడం వల్ల ప్రజలు ఆయనను మరింతగా గుర్తుంచుకునేలా, మాట్లాడుకునేలా చేశారని మురసోలి డిసెంబర్ 20, 2025 నాటి సంపాదకీయంలో పేర్కొంది.
మునుపటి చట్టంలా కాకుండా పని కల్పించకపోతే పరిహారం చెల్లించే అవకాశం లేదు. 125 రోజుల పాటు పని కల్పించే హామీ కూడా లేదు. ఎప్పుడైనా ఈ పథకాన్ని నిలిపివేయడానికి వీలు కల్పించే అన్ని లక్షణాలు ఉన్నాయి.
నిధుల కేటాయింపు గురించి..
ఈ పథకం అమలు కోసం వార్షికంగా రూ. 1,51,282 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో కేంద్ర వాటా: రూ. 95,692.31 కోట్లు.
పర్యవేక్షణ, శిక్షణ కోసం ఖర్చు పరిమితిని 6% నుండి 9% కి పెంచారు.
ఏఏ రంగాలకు ప్రాధాన్యం?
ఈ బిల్లు కింద జరిగే పనులు కేవలం గుంతలు తీయడానికే పరిమితం కాకుండా, శాశ్వత ఆస్తుల కల్పనపై దృష్టి పెడతాయి:
జల భద్రత (Water Security): భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణ పనులు.
గ్రామీణ మౌలిక సదుపాయాలు (Core Infrastructure): రోడ్లు, కనెక్టివిటీ పనులు.
జీవనోపాధి మౌలిక సదుపాయాలు (Livelihood Assets): నిల్వ కేంద్రాలు (Storage), మార్కెట్లు, ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం.
వరద కాలువలు, నేల సంరక్షణ వంటి పనులు.

