Jairam Ramesh | మోదీ వాస్తవాలను పట్టించుకోవడం లేదు..
మోదీ హయాంలో దేశంలోని పట్టణ మధ్యతరగతి ప్రజల ప్రగతి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మోదీ హయాంలో దేశంలోని పట్టణ మధ్యతరగతి ప్రజల ప్రగతి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల వ్యయాన్ని ప్రభావితం చేసే మూడు క్లిష్టమైన సవాళ్లను వివరించిన మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ నివేదికను ఆయన ప్రస్తావించారు. ప్రజల్లో పొదుపు చేయడం తగ్గిపోవడం, కోవిడ్ అనంతర ప్రజా జీవనం మందగించడాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నించారు. ఆర్‌బీఐ ప్రకారం దేశంలో జీడీపీ నికర గృహ పొదుపులు దాదాపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయని రమేష్ చెప్పారు. ఆర్థిక విధానాలు, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శిస్తూ, మధ్యతరగతి ప్రజలను ఆర్థిక ఒత్తిడి నుంచి రక్షించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.
"పట్టణ మధ్యతరగతి అసమానంగా ప్రభావితమైంది.' ఈ వాస్తవాన్ని ప్రధాని ఎప్పుడు గుర్తిస్తారు?" అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.