JUSTICE | హైకోర్టు జడ్జీలలో ఇప్పటికీ అగ్ర కులాలదే ఆధిపత్యం!
x

JUSTICE | హైకోర్టు జడ్జీలలో ఇప్పటికీ అగ్ర కులాలదే ఆధిపత్యం!

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రకటించారు. 2018 నుంచి 650 మందిని నియమిస్తే వారిలో 492 మంది అగ్రకులాల వారే.


వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టు న్యాయమూర్తుల్లో ఇప్పటికీ అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోంది. 2018 నుంచి ఇప్పటి వరకు నియమితులైన జడ్జీలలో అగ్రకులాల వారే ఎక్కువగా ఉన్నారు. సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాలే రాజ్యసభలో ఈ విషయాన్ని చెప్పారు. ఇతర బడుగు, బలహీనవర్గాలతో పోల్చుకుంటే అగ్రవర్ణాల వారే ఎక్కువ ఉన్నారన్నది ఆయన చెప్పిన వివరాల సారాంశం.
దేశంలోని హైకోర్టులకు ప్రస్తుతం మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 1,114. సుప్రీంకోర్టులో ఉండాల్సిన సంఖ్య 34. వీరిలో 2018 నుంచి 2024 వరకు 650 మందిని నియమించారు. వారిలో 76 శాతం మంది అంటే 492 మంది అగ్రకులాల వారే కావడం గమనార్హం. ఈ తీరును సరిదిద్దాలని చాలా కాలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కోరుతున్నాయి. అయినప్పటికీ ఆ వర్గాల నుంచి న్యాయమూర్తులు అత్యున్నత న్యాయస్థానాలకు నియమితులు కాకపోవడం బాధాకరమన్నారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.
2018 నుంచి వివిధ హైకోర్టులకు 492 మంది న్యాయమూర్తులను నియమించారు. హైకోర్టు కొలీజియంలు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుంటాయి. పేర్లను సిఫార్సు చేయడానికి ముందు న్యాయవాదులు, ఇతర జ్యూడిషియల్ అధికారుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంటారు. న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్ కోటాలు ఏమీ ఉండవు. ప్రతిభ ప్రాతిపదికనే వీరి నియామకం ఉంటుంది.
సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి రిజర్వేషన్ల కోటా ఏమీ ఉండదని మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ కూడా స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 124, 217, 224 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను నియమిస్తారు. ఏ కులానికి లేదా వర్గానికి రిజర్వేషన్లు ఉండవు. అందువల్ల కులాలా వారీ డేటా కేంద్రం వద్ద లేదని మంత్రి చెప్పారు.
2018 నుంచి హైకోర్టులు, సుప్రీంకోర్టులలో ప్రతి ఏటా నియమితులైన వారి జాబితాను రాజ్యసభలో మంత్రి చదివి వినిపించారు. కొలీజియం వ్యవస్థ సిఫార్సుల మేరకు న్యాయస్థానాలకు న్యాయమూర్తులను నియమించే ప్రస్తుత వ్యవస్థలో SC, ST, OBC, మహిళలు, మైనారిటీలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా న్యాయవ్యవస్థపై ఉంటుంది. హైకోర్టు కొలీజియం/సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయని ఏ వ్యక్తిని అయినా ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తిగా నియమించదు.
అయినప్పటికీ, ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకంలో సామాజిక వైవిధ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ చెప్పారు. న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపేటప్పుడు, షెడ్యూల్డ్ కులాలలో అర్హులైన అభ్యర్థులను పరిశీలించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోందని చెప్పారు. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకంలో సామాజిక వైవిధ్యాం ఉండేలా షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని మంత్రి వివరించారు.
2018 నుంచి 2024 డిసెంబర్ 6 వరకు 650 మందిని నియమిస్తే వారిలో 492 మంది అగ్రవర్ణాల వారే. కేవలం 158 మంది మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు. ఈ 158 మందిలో 20 మంది ఎస్సీలు, 12మంది ఎస్టీలు, 77 మంది ఓబీసీ క్యాటగిరీ, 36మంది మైనారిటీలకు చెందిన వారు. మిగిలిన 13 మంది న్యాయమూర్తులకు సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని మంత్రి చెప్పారు. ఎస్సీలలో చాలా తరగతులు ఉన్నాయని, ఇప్పుడు నియమితులైన ఎస్సీ న్యాయమూర్తులు ఏ కులానికి చెందిన వారో తమ వద్ద సమాచారం లేదని మంత్రి వివరించారు. సుప్రీంకోర్టుకు సంబంధించి మొత్తం ఉండాల్సిన జడ్జీల సంఖ్య 34మంది కాగా పూర్తిగా న్యాయమూర్తులను నియమించారు. ఇక హైకోర్టులకు సంబంధించి ప్రస్తుతం ఉండాల్సిన న్యాయమూర్తులు 1,114 మంది కాగా ఇప్పటికి నియమించిన వారి సంఖ్య 790కి చేరింది. ఇంకా 324 మందిని నియమించాల్సి ఉంది. కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి పేర్లను ప్రతిపాదించాలని ఆయా హైకోర్టుల న్యాయమూర్తులను కోరినట్టు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ చెప్పారు. కనీసం ప్రతిపాదిత న్యాయమూర్తుల నియామకంలోనైనా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు చెందిన పేర్లు ఉంటాయేమో చూస్తామని ఆయా సంఘాలు అంటున్నాయి.
Read More
Next Story