
ముసాయిదా ఓటరు జాబితాపై సమాజ్‌వాది అఖిలేష్ యాదవ్ ఆందోళన
దళితులు, మైనార్టీల పేర్లను తొలగించారని ECపై ఆగ్రహం..
ఉత్తరప్రదేశ్(Utter Pradesh) రాష్ట్రంలో ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (S.I.R) పారదర్శకంగా లేదని, అధికార పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా ఎన్నికల సంఘం నడుచుకుందని సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)
ఆరోపించారు. ముసాయిదా జాబితాలో ఓటర్ల పేర్లును భారీ సంఖ్యలో తొలగించబడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఒక్క జిల్లాలోనే లక్షల సంఖ్యలో PDA (Picchda, Dalit, Alpsankhyak) వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇదంతా జరుగుతోందని, ప్రజల ఓటు హక్కును హరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, తొలగింపులపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ముసాయిదా జాబితా ప్రచురించటానికి ముందే బీజేపీకి మద్దతు ఇచ్చే 4 కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగిస్తామని ఎలా చెప్పగలిగారని అఖిలేష్ ప్రశ్నించారు.
"ఇప్పుడు ముసాయిదా జాబితా విడుదలైంది. దాదాపు 3 కోట్ల మందిని తొలగిస్తారని మేము భయపడ్డాం. కానీ జాబితా బయటకు రాకముందే ఎవరికీ ఎటువంటి సమాచారం లేనప్పుడు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 4 కోట్ల మంది ఓటర్లను తొలగించబోతున్నారని, ఆ ఓటర్లు బీజేపీకి చెందినవారు అని ఎలా చెప్పగలిగారు?’’ అని నిలదీశారు.
అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా (CEO) ముసాయిదా జాబితా నుంచి మొత్తం 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్లు ప్రకటించారు.
ఈ అంశం యూపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుండగా.. ఓటర్ల జాబితా సవరణపై మరింత స్పష్టత రావాల్సి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

