
ఉత్తర్‌ప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటరు జాబితా: సుమారు 2.89 కోట్ల పేర్లు తొలగింపు
జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకు వాదనలు, అభ్యంతరాల స్వీకరణ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) ముగియడంతో భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం (జనవరి 6) ఉత్తరప్రదేశ్(Utter Pradesh) ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. దాదాపు 2.89 కోట్ల పేర్లను తొలగించారు. ఇది దేశంలోనే అత్యధికం. ముసాయిదా ఓటర్ల జాబితాలో 12.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అక్టోబర్ 2025 ఓటర్ల జాబితాలో ఉత్తరప్రదేశ్‌లో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరణాలు, శాశ్వత వలసలు లేదా డబుల్ రిజిస్ట్రేషన్ల కారణంగా దాదాపు 2.89 కోట్ల పేర్లు (18.70 శాతం) ముసాయిదా జాబితాలో చేర్చలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా లక్నోలో విలేఖరులతో అన్నారు.
ఇంటింటికి గణన కార్యక్రమం..
"మాకు దాదాపు 12.5 కోట్ల బ్యాలెట్ పత్రాలు వచ్చాయి. మరణించిన ఓటర్ల సంఖ్య 46.23 లక్షలు. 2.17 కోట్ల మంది ఓటర్లు వలసవెళ్లారు. 25.47 లక్షల మంది ఓటర్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల కనిపించాయి. మొత్తంమీద 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లు ముసాయిదాలో చేర్చలేదు" అని రిన్వా వివరించారు. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకు వాదనలు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని చెప్పారు.
ఎన్నికల కమిషన్ ఇంటింటికీ తిరిగి గణన కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఈ ప్రక్రియ మొదట డిసెంబర్ 11న ముగియాల్సి ఉండగా దాదాపు 2.97 కోట్ల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించినందున రాష్ట్రం అదనంగా 15 రోజులు సమయం కోరిందని చెప్పారు.

