
యూపీ స్కూళ్లు, కాలేజీల్లో తమిళ తరగతులు
ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమ ప్రేరణతో..
దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య భాషా, సాంస్కృతిక సమైక్యతను పెంపొందించడంలో భాగంగా ఉత్తరప్రదేశ్(Utter Pradesh)లోని పాఠశాలలు, కళాశాలల్లో తమిళ(Tamil) భాషా తరగతులను ప్రవేశపెట్టనున్నారు. డిసెంబర్ 28న ప్రధాని మోదీ ( PM Modi) ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తక్కువ సమయంలోనే తమిళం భాషను నేర్చుకున్న ప్రభుత్వ క్వీన్స్ కళాశాల విద్యార్థిని పాయల్ పటేల్‌ను మోదీ అభినందించిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలతో ప్రేరణ పొందిన ప్రభుత్వ క్వీన్స్ కళాశాల..రోజూ సాయంత్రం తమిళ భాషా తరగతులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందుకు అధికారిక మద్దతు లభించిందని కాలేజీ ప్రిన్సిపాల్ సుమిత్ కుమార్ తెలిపారు. అలాగే వారణాసి నుంచి దాదాపు 50 మంది ఉపాధ్యాయులను హిందీ బోధించడానికి తమిళనాడుకు పంపే ఆలోచన కూడా ఉందని అధికారులు తెలిపారు.
పాయల్ పటేల్‌కు గతంలో తమిళం నేర్పిన తమిళనాడుకు చెందిన సంధ్య కుమార్ సాయితో చర్చలు జరిగాయని, ఆమె ఆన్‌లైన్ తరగతులు తీసుకోవడానికి అంగీకరించిందని ప్రిన్సిపాల్ చెప్పారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని తమిళ విభాగం అధిపతి కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కాశీ, తమిళనాడు మధ్య ఉన్న యుగాల నాటి నాగరికత, సాంస్కృతిక, విద్యా సంబంధాలను తెలియపర్చడమే కాశీ తమిళ సంగమం అని హరీష్ చంద్ర గర్ల్స్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రియాంక తివారీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా తమ సంస్థలో 15 రోజుల తమిళ భాషా కార్యక్రమం నిర్వహించామని, ఇందులో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు.

