
సెంగార్‌కు బెయిల్‌పై సుప్రీంలో రేపు విచారణ
సీబీఐ పిటీషన్‌ను విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం ..
2017 ఉన్నావ్ అత్యాచారం కేసు(Unnao rape cas)లో బహిష్కృత BJP లీడర్ కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ(CBI) సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం రేపు (డిసెంబర్ 29న) విచారించనుంది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు..హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాదులు అంజలే పటేల్, పూజా శిల్ప్కర్ దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను కూడా విచారించనుంది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశం..
అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సెంగర్ జైలు శిక్షను డిసెంబర్ 23న హైకోర్టు సస్పెండ్ చేసింది. అతను ఇప్పటికే ఏడు సంవత్సరాల ఐదు నెలల జైలు శిక్ష అనుభవించాడని పేర్కొంది. బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో కూడా సెంగర్ దోషి. ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పటికే జైలు శిక్ష అనుభవించినందున తనను విడుదల చేయాలని సెంగర్ పిటీషన్ వేశారు.
షరతులతో కూడిన బెయిల్..
సెంగర్ జైలు శిక్షను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ముగ్గురు పూచీకత్తుతో పాటు రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని సెంగర్‌ను ఆదేశించింది. ఢిల్లీలోని బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లవద్దని, బాధితురాలిని లేదా ఆమె తల్లిని బెదిరించవద్దని కూడా ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.
ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, దానికి సంబంధించిన ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేయడం గమనార్హం.

