రాష్ట్రపతి నిలయంలో అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఎందుకుంది?  ఇప్పుడెలా ఉంది ?
x

రాష్ట్రపతి నిలయంలో అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఎందుకుంది? ఇప్పుడెలా ఉంది ?

‘ఉద్యాన్ ఉత్సవ్’ లో అండర్ గ్రౌండ్ టన్నెల్‌‌, ఫ్లాగ్‌పోస్టు, నక్షత్ర గార్డెన్, నెచర్ క్లాస్ రూం, దిగుడు బావి, నాలెడ్జ్ గ్యాలరీ, రాక్ గార్డెన్‌ చూడదగ్గ ప్రదేశాలు..


హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం(Rashtrapati Nilayam) లో సందడి వాతావరణం నెలకొంది. ఉద్యాన్ ఉత్సవ్ (Udyan Utsav) పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రకృతి ఔత్సాహికులను, ఉద్యానవన ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. జనవరి 2 నుంచి 13వ తేదీ వరకు ఈ ఉత్సవ్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో విజిటర్స్ సంఖ్య పెరిగిపోయింది.

ఇక రాష్ట్రపతి భవన్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు ఏటా శీతాకాల విడిది కోసం ఇక్కడకు వస్తుంటారు. తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్ర ప్రసాద్‌ ఇక్కడ విడిది చేశారు. తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వి. వి. గిరి, డాక్టర్ నీలం సంజీవ రెడ్డి, ప్రణబ్ ముఖర్జీ, ద్రౌపది ముర్ము ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. 2023 మార్చిలో రాష్ట్రపతి ముర్ము సందర్శకులకు దీన్ని అందుబాటులోకి తెచ్చారు.

రాష్ట్రపతి మూడు అధికారిక నివాసాల్లో ఇది ఒకటి. మిగతా రెండు ఢిల్లీ, సిమ్లాలో ఉన్నాయి. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయాన్ని 1860లో నిర్మించారు. స్వాతంత్రానికి ముందు బ్రిటీష్ ఉన్నతాధికారుల ఇక్కడే స్టే చేసేవారు. అప్పట్లో దీన్ని "రెసిడెన్సీ హౌస్"గా పిలిచే వారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నిజాం పాలనలో ఓ సైనిక ఉన్నతాధికారి ఇందులో నివాసం ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దీన్ని రాష్ట్రపతి నిలయంగా మార్చారు. ఈ నిలయం మొత్తం విస్తీర్ణం 90 ఎకరాలు. ఈ ప్రెసిడెన్షియల్ రెసిడెన్సీలో స్టడీ రూం, సినిమా హాల్, దర్భార్ హాల్‌తో కలిసి మొత్తం 16 గదులు ఉంటాయి. నిలయం బయట ప్రాచీన కట్టడాలు, రకరకాల పండ్ల తోటలు, అందమైన పూలమొక్కలు మన్నల్ని కనువిందు చేస్తాయి. ఈ భవనాన్ని సందర్శకులు చూసేందుకు ఏడాదిలో కొన్ని రోజులు పాటు ఉచితంగా అనుమతిస్తారు.

మ్యూజికల్ ఫౌంటేన్..


చుట్టూ పచ్చటి పూలమొక్కలు..మ్యూజిక్‌కు అనుగుణంగా వచ్చి వెళ్లే నీళ్లు.. చాలా కనువిందుగా ఉంటుంది.విజిట్ చేసినపుడు చూడదగ్గ వాటిలో ఇదొకటి.

నాలెడ్జ్ గ్యాలరీ..

పేరుకు తగ్గట్టుగానే మీ గ్యాలరీ నుంచి మనం కొంత నాలెడ్జ్ పొందుతాం. లోపల మాజీ రాష్ర్టపతులు అందుకున్న గౌరవ పురస్కారాలను చూడొచ్చు. వారు వాడిన కారు.. బగ్గీ స్పెషల్ అట్రాక్షన్.

రాక్ గార్డెన్‌..


ఇక్కడ రెండు పెద్ద బండరాళ్లపై శివుడు, నంది విగ్రహాలను చెక్కారు. వీటిపై నుంచి వచ్చే చిన్నపాటి జలపాతం (Water Cascade) చాలా ఆకట్టుకుంటుంది.ఇది మంచి ఫోటో స్పాట్. చీకటి పడుతున్నపుడు చాలా అందగా కనిపిస్తుంది.

ఫ్లాగ్‌పోస్ట్...


ఇక్కడ మనకు కనిపిస్తున్నది 120 అడుగుల ఎత్తు ఉన్న ఫ్లాగ్‌పోస్ట్ ( Flagpost). గతంలో ఇదే ఎత్తులో ఇక్కడ టేకుతో చేసిన ఫ్లాగ్‌పోస్ట్ ఉండేది.కాలక్రమేణా అది కూలిపోయింది. దాని తాలుకూ ముక్కలు గ్లాస్‌బాక్స్‌లో భద్రపరిచారు. హైదరాబాద్‌లో 1948 సెప్టెంబర్‌లో ఇక్కడ జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేశారు.

దిగుడు బావి..


చాలా ఏళ్ల క్రితం నాటి ఇలాంటి బావులను మనం అక్కడక్కడా చూస్తుంటాం. హైదరాబాద్ బన్సిలాల్ పేటలో కూడా ఓ మెట్ల బావి ఉంది. రాష్ట్రపతి నిలయంలో ఓ పెద్ద దిగుడు బావి ఉంది. దీనికి జైహింద్ స్టెప్ వెల్(Jai Hind Stepwell) అని పేరుపెట్టారు. రాష్ట్రపతి నిలయంలో ఇలాంటివి మూడున్నాయి. వాటిని జై హింద్ బావి, నక్షత్ర బావి, చిన్న బావి పేర్లతో పిలుస్తుంటారు. ఇవి సంప్రదాయ జల సంరక్షణకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మిగిలిపోయాయి.

160 ఏళ్ల మర్రిచెట్టు(Banyan Tree)


ఇదొక భారీ మర్రి చెట్టు. ఊడలు భారీగా పెరిగిపోయి కనిపిస్తుంది. ఎన్నో భారీ వర్షాలకు తట్టుకుని నిలబడింది. దీన్ని రాష్ట్రపతి నిలయానికి సజీవ సాక్ష్యంగా చెబుతుంటారు.

ఔషధ మొక్కల వనం.. ప్రూట్ ఆర్చిడ్స్..


సుమారు 30 రకాల మెడిసినల్ ప్లాట్స్ ఈ వనంలో చూడొచ్చు. ప్రకృతి వైద్యంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక పోతే పండ్ల తోటలు.. 33 ఎకరాలలో పండ్ల మొక్కలు పెంచారు. నారింజ, మామిడి, సీతాఫలం, దానిమ్మ, జామ, కొబ్బరి చెట్లు కనిపిస్తాయి.

నక్షత్ర గార్డెన్..


దీన్నే కొంతమంది నక్షత్ర గార్డెన్ (Nakshatra Garden) అని కూడా పిలుస్తుంటారు. జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉంటాయన్న విషయం మనకు తెలుసు. ఈ 12 రాసులను ప్రతిబంబించేలా ఇక్కడ మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగాయి. వాటిని మనం చూడొచ్చు. 2015లో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ గార్డెన్‌ను ప్రారంభించారు.

నెచర్స్ క్లాస్ రూం (Nature's Classroom)..


విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ కొన్నింటిని కుర్చీల్లా ఏర్పాటు చేశారు. వీటిని వెదురుతో తయారు చేశారు. ఇక్కడ కూర్చొని సేద తీరడం నిజంగా ఓ ప్రత్యేక అనుభూతి.

రాష్ట్రపతి నిలయంలో భూగర్భ టన్నెల్ (Cheriyal Art Tunnel)..


రాష్ట్రపతి నిలయంలో ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణం. 160 అడుగుల ఈ కిచెన్ టన్నెల్ నిర్మాణం వెనక రెండు కారణాలున్నాయి. వంట గది నుంచి ఆఫీస్ రూంకు ఈ టన్నెల్‌ కనెక్టయ్యింది.కిచెన్ రూం నుంచి తెచ్చే ఆహారం ఎక్కడా విషతుల్యం కాకుండా ఉండేందుకు బ్రిటీషర్లు జాగ్రత్త పడ్డారు. ఇంకో కారణం కూడా ఉంది. తమ సేవకులు బంగళాలో అటు ఇటు తిరుగుతూ కనిపించడాన్ని ఇష్టపడేవారు కాదు. టన్నెల్ నిర్మాణానికి ఇవే కారణాలని చెబుతుంటారు. 2023లో ఈ టన్నెల్ రూపురేఖలు మారిపోయాయి. గోడలపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు మనకు కనిపిస్తాయి.

Read More
Next Story