ఉమర్ నబీ అలాంటోడు కాదు: కుటుంబసభ్యులు
x

ఉమర్ నబీ అలాంటోడు కాదు: కుటుంబసభ్యులు

ఢిల్లీలో కారు పేలుడుతో సంబంధం ఉందని భావిస్తున్న ఉమర్ నబీ ఓ కళాశాలలో ఫ్యాకల్టీ. ఉగ్రవాద లింకులున్నాయన్న ఆరోపణలను నమ్మలేకపోతున్నా: ఉమర్ వదిన


Click the Play button to hear this message in audio format

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు పుల్వామాకు చెందిన డా. ఉమర్ నబీకి సంబంధ ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతని కుటుంబనేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఉమర్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో లింకు ఉందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని అతని కుటుంబసభ్యులు అంటున్నారు.

ఈ కారు పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పేలుడు సంభవించిన హ్యుందాయ్ i20 కారును ఉమర్ నబీ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు తీవ్రత దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఉమర్ నబీ ఫరీదాబాద్‌లోని ఓ కళాశాలలో ఫ్యాకల్టీ.


కుటుంబసభ్యులు ఏమంటున్నారంటే..

డాక్టర్ ఉమర్ నబీ వదిన ముజామిల్ మాట్లాడుతూ.. ‘‘ఉమర్ చిన్నప్పటి నుంచి ముభావంగా ఉండే వ్యక్తి. ఎక్కువ మంది స్నేహితులు కూడా లేరు. ధ్యాసంతా చదువు, పనిమీదే. శుక్రవారం ఫోన్ చేశాం. పరీక్షలు ఉన్నందున బిజీగా ఉన్నానని, మూడు రోజుల తర్వాత ఇంటికి వస్తానని చెప్పాడు.కుటుంబానికి అండగా నిలుస్తాడని కష్టపడి చదివిస్తున్నాం. పేలుడు ఘటనతో ఉమర్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో లింకు ఉందంటే నమ్మలేకపోతున్నాం. ఉమర్ చివరిసారిగా రెండు నెలల క్రితం కాశ్మీర్‌‌కు వెళ్లాడు.’’ అని ఉమర్ నబీ వదిన ముజామిల్ చెప్పారు.

ఢిల్లీ పోలీసుల ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె, డిటోనేటర్లను ఉపయోగించారని, ఫరీదాబాద్‌లో బయటపడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలు, మండే పదార్థాలతో దీనికి సంబంధం ఉందని తెలుస్తోంది. అయితే తుది నివేదిక రావాల్సి ఉంది.


ఎవరీ ఉమర్‌ మహ్మద్‌..?

పుల్వామాకు చెందిన ఉమర్‌ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. తండ్రి జీహెచ్‌ నబీ భట్‌, తల్లి షమీమా బానో. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదేళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలిగారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్‌ ఎంబీబీఎస్‌, ఎండీ (మెడిసన్‌) పూర్తి చేశాడు. కొన్నాళ్లు.. జీఎంసీ అనంతనాగ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌గా ఉన్నాడు. అనంతరం ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్‌లో పలువురు డాక్టర్లను భద్రతాధికారులు అరెస్టు చేశారు. వారితో ఉమర్‌కు కూడా సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Read More
Next Story