అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమావేశాలు ..
x

అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమావేశాలు ..

హాజరయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు: పార్టీ బలోపేతంపై దృష్టి.. గుజరాత్ ఎన్నికలకు వ్యూహం..


‘అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ’ (AICC) సమావేశాలు రెండు రోజుల పాటు అహ్మదాబాద్‌(Ahmedabad)లో జరుగుతున్నాయి. మంగళ, బుధవారం జరిగే ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పలు అంశాలపై చర్చించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనిపించిన తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్స్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు పార్టీ రోడ్ మ్యాప్, కీలకమైన జాతీయ సమస్యలు, రాబోయే గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశానికి హాజరయిన వారిలో కాంగ్రెస్ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, కమల్ నాథ్, భూపేశ్ బఘేల్, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, అశోక్ గెహ్లాట్, జైరామ్ రమేష్, రణదీప్ సుర్జేవాలా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, డిప్యూటీ డి.కె. శివకుమార్, రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖు, డిప్యూటీ ముఖేష్ అగ్నిహోత్రి పాల్గొన్నారు.

సబర్మతి ఆశ్రమం, కోచ్రబ్ ఆశ్రమం మధ్య సబర్మతి నది ఒడ్డున ఏప్రిల్ 9 జరిగే ఈ AICC సమావేశానికి ఎంపిక చేసిన సభ్యులు సుమారు 1,700 మంది దాకా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆమోదించే తీర్మానాలపై CWC చర్చించే అవకాశం ఉంది. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్‌కు గుజరాత్‌తో చారిత్రక సంబంధం ఉంది. ఆ పార్టీ ఇప్పటి దాకా ఐదు సమావేశాలను ఇక్కడే నిర్వహించింది. ప్రస్తుతం జరుగుతున్నది ఆరవది.

Read More
Next Story