పెరుగుతోన్న HMPV కేసులు: ఆందోళన అవసరం లేదంటున్న కేంద్రం
x

పెరుగుతోన్న HMPV కేసులు: ఆందోళన అవసరం లేదంటున్న కేంద్రం

కర్ణాటకలో తొలుత ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. తర్వాత తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్‌లోనూ హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి.


చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) భారత్‌లోకి ప్రవేశించింది. తొలిసారిగా బెంగళూరు(Bangalore)లో రెండు కేసులు నమోదయ్యాయి. 3 నెలల, 8 నెలల శిశువులకు సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. అయితే వీరి కుటుంబసభ్యుల్లో ఎవరికి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం.

ఒకరు డిశ్చార్చ్.. మరొకరు కోలుకుంటున్నారు..

బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రికి బ్రాంకోన్యూమోనియాతో వచ్చిన మూడు నెలల బాలికకు హెచ్‌ఎంపీవీ నిర్ధారణ కావడంతో ఆమెకు చికిత్స చేశారు. ఇప్పటికే డిశ్చార్జ్ కూడా చేశామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎనిమిది నెలల బాలుడికి జనవరి 3న పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తమిళనాడు, గుజరాత్, బెంగాల్‌లోనూ కేసులు..

పొరుగు రాష్ట్రం తమిళనాడు(Tamilnadu)లో మరో ఇద్దరు పిల్లలు ఈ వైరస్‌ బారినపడ్డారు. ప్రస్తుతం వీరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఐదో కేసు నమోదైంది. రాజస్థాన్‌(Rajastan) లోని డుంగార్పూర్‌కు చెందిన రెండు నెలల బాలుడికి పాజిటివ్ అని తేలింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ బాలుడి పరిస్థితి బాగానే ఉందని అహ్మదాబాద్(Ahmedabad) మున్సిపల్ కార్పొరేషన్ వైద్య అధికారి భవిన్ సోలంకీ తెలిపారు. ఆరో కేసు పశ్చిమ బెంగాల్‌లో నమోదైంది. ఎనిమిది నెలల బాలుడు కోల్‌కతా(Kolkata)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రెడీ టు ఫేస్..

హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా పేర్కొన్నారు. 2001లో మొదటిసారిగా దీన్ని గుర్తించారని తెలిపారు. గాలి ద్వారా వ్యాపి చెందే ఈ వైరస్ అన్ని వయసుల వారికీ సోకుంతుందని, సాధారణంగా శీతాకాలం వసంత రుతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నడ్డా వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాన్ని (NCDC) ఇప్పటికే అప్రమత్తం చేశామని చెప్పారు. జనవరి 4న DGHS ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోటానికి సిద్ధంగా ఉన్నాయని నడ్డా స్పష్టం చేశారు.

హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటి?

హెచ్‌ఎంపీవీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్వాసకోశ వైరస్. చైనాలో ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో ఈ వైరస్‌కు ప్రాముఖ్యత లభించింది. ఈ వైరస్ అన్ని వయసుల వారికి సంక్రమిస్తుంది. హెచ్‌ఎంపీవీ గురించి కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన అవసరం లేదని ప్రకటించారు. ఢిల్లీ ఆప్ సర్కారు మాత్రం అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

వైరస్ లక్షణాలు..

దగ్గు, జ్వరం, ముక్కు నుంచి నీరు కారటం లేదా ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి హెచ్ఎంపీవీ లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మరికొంతమందిలో ఒంటిపై దద్దుర్లు కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Read More
Next Story