
ప్రియాంక్ ఖర్గేకు బెదిరింపు కాల్స్..
కాషాయ పార్టీ నాయకుల పిల్లలు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనరు?.. ప్రశ్నించిన కర్ణాటక మంత్రి ..
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ సంస్థల్లో RSS కార్యకలాపాలను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరిన తనకు.. రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) మంగళవారం (అక్టోబర్ 14) పేర్కొన్నారు.
"గత రెండు రోజులుగా నా ఫోన్ మోగుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ సంస్థలలో RSS కార్యకలాపాలను నిషేధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరా. దాంతో నాకు, నా కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరిస్తే వెనక్కు తగ్గే వ్యక్తిని కాదు నేను," అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు ఖర్గే.
'అలా ఎక్కడా చెప్పలేదు'
అంతకుముందు రోజు, ఖర్గే ANI తో మాట్లాడుతూ.. తాను RSS పై నిషేధం విధించాలని ఎప్పుడూ కోరలేదని, ప్రభుత్వ సంస్థల్లో దాని కార్యకలాపాలపై నిషేధం విధించాలని మాత్రమే కోరానని స్పష్టం చేశారు. బీజేపీని విమర్శిస్తూ.. కాషాయ పార్టీ నాయకుల పిల్లలు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనరు? గోరక్షకులు, ధర్మరక్షకులుగా ఎందుకు మారరు? అని ప్రశ్నించారు ఖర్గే.