
గుజరాత్‌లో చనిపోయిన ఓటర్లు 17 లక్షలకుపైనే.
నవంబర్ 4 నుంచి మొదలై డిసెంబర్ 11న ముగియనున్న S.I.R
గుజరాత్(Gujarat) రాష్ట్రంలో సుమారు 17 లక్షలకుపైగా ఓటర్లు చనిపోయారని, ఈ విషయం ఓటరు సర్వేలో బయటపడిందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(S.I.R) కొనసాగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో బూత్-స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. డిసెంబర్ 11 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
"33 జిల్లాల్లో 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. తిరిగి స్వీకరించిన ఫారాలను డిజిటలైజ్ చేసే పని జరుగుతోంది. ఇప్పటివరకు 182 అసెంబ్లీ నియోజకవర్గాలలో 12 చోట్ల డిజిటలైజేషన్ పూర్తయ్యింది," అని పేర్కొంది ఈసీ.
"S.I.R ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల మంది మరణించిన ఓటర్లు జాబితాలో ఉన్నారు. 6.14 లక్షలకు పైగా ఓటర్లు వారి చిరునామాల్లో లేరు. 30 లక్షలకుపైగా ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు బయటపడింది" అని ఎన్నికల సంఘం పేర్కొంది.
డిజిటలైజేషన్ ప్రక్రియలో డాంగ్ జిల్లా ప్రథమం..
డిజిటలైజేషన్ ప్రక్రియలో 94.35 శాతంతో డాంగ్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బనస్కాంత జిల్లాకు చెందిన ధనేరా, తరద్, దాహోద్ జిల్లాలోని లిమ్ఖేడా, దాహోద్ (ST), ఆరావళి జిల్లాకు చెందిన బయాద్, రాజ్‌కోట్ జిల్లాకు చెందిన ధోరాజీ, జస్దాన్, గొండాల్, జునాగఢ్ జిల్లాకు చెందిన కేశోద్, ఖేడా జిల్లాలోని మెహమదాబాద్, ఆనంద్ జిల్లాలోని ఖంభాట్, నవ్సారి జిల్లాలోని జలాల్‌పూర్ ఉన్నాయి.

