రాజమహేంద్రవరం హృదయాలను చీల్చిన పాల మోసం
x
రాజమండ్రిలోని కిమ్స్ ఆస్పత్రి వద్ద బాధితుల బంధువులు

రాజమహేంద్రవరం హృదయాలను చీల్చిన పాల మోసం

రాజమహేంద్రవరంలో పాల కల్తీ ప్రాణాలు తీయడం దేశంలోనే చర్చ నియాంశంగా మారింది.


గేదెల వద్ద నేరుగా పిండిన పాలు… ఎంత శుద్ధంగా ఉంటాయో చూడండి అని నవ్వుతూ చెప్పి పాలు అందించిన గణేష్ మాటలు ఇప్పుడు చౌడేశ్వరినగర్, రాజేంద్రనగర్ వీధుల్లో గుండెల్ని పిండుతున్నాయి. 76 ఏళ్ల తాడి కృష్ణవేణి తన మనవరాలికి పాలు తాగించి నవ్వుతూ పడుకున్నారు. రెండు రోజుల్లోనే మూత్రపిండాలు ఆగిపోయి ఆమె కళ్లు మూశారు. అదే వీధిలో 58 ఏళ్ల తాడి రమణి, 74 ఏళ్ల ఎం రాధాకృష్ణమూర్తి, 72 ఏళ్ల శేషగిరిరావు… నాలుగు ఇళ్లు ఇలా ఖాళీ అయ్యాయి. “మా అమ్మకు పాలు తప్ప మరో రోగం లేదు” అని కొడుకులు ఏడుస్తున్నారు. బి కనకరత్నం మృతి కూడా అదే కల్తీ పాల వల్లేనని కుటుంబం ఆరోపిస్తోంది.

ప్రతి ఇంటా ఇప్పుడు భయం. పిల్లలు పాలు చూస్తేనే ఏడుస్తున్నారు. తల్లులు గేదెల పాలు అని నమ్మి కొన్న ఆ పాలు చూస్తే గుండె ఆగిపోతోంది. “చనిపోయాకే కల్తీ అని తెలుస్తోంది” అని ఒక తల్లి కళ్లలో నీళ్లు పెట్టుకుని అన్నారు. గణేష్ అరెస్టు అయినా… నాలుగు హత్య కేసులు నమోదైనా… ఆ నాలుగు ప్రాణాలు తిరిగి రావు. రాజమహేంద్రవరం ఇప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచిస్తోంది. మనం తాగేది పాలా… విషమా? అని.


16 మంది బాధితులు

ఇప్పటివరకు 16 మంది బాధితులను అధికారులు గుర్తించగా వారిలో నలుగురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరో బాధితురాలు బి కనకరత్నం (ఈనెల 20న జీజీహెచ్‌లో మృతి) పేరు ఇంకా అధికారిక జాబితాలో చేర్చలేదు.

పాల కల్తీ వల్ల మరణించిన వారి పేర్లు

తాడి కృష్ణవేణి (76 సం.), చౌడేశ్వరినగర్

తాడి రమణి (58 సం.), చౌడేశ్వరినగర్

ఎం రాధాకృష్ణమూర్తి (74 సం.), చౌడేశ్వరినగర్

శేషగిరిరావు (72 సం.), చౌడేశ్వరినగర్


అధికారులు ఏమన్నారు...

కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిశోర్‌లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. ఆయన సంఘటనపై సమీక్ష చేశారు. ‘ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిజం బయటపెట్టి బాధితులకు న్యాయం చేయాలి’ అని ఆదేశాలు ఇచ్చారు.

డీఎం హెచ్‌ఓ వినూత్న మాట్లాడుతూ లూజు పాలు తాగేవారు కొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అనుమానం, ఆరోగ్య సమస్యలు కనిపించినా వెంటనే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు 9494060060 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలి. మేము తక్షణం చర్యలు తీసుకుంటాం అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ నిర్వహించే కేంద్రంలోని ఒక క్యాన్‌లో కల్తీ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అని ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు.

పోలీసు చర్యలు

పాల వ్యాపారి గణేశ్వరరావుపై చౌడేశ్వరినగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, తాడి రమణి, శేషగిరిరావు, ఎం. రాధాకృష్ణమూర్తి మరణాలపై నాలుగు హత్య కేసులు నమోదు చేసారు. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు. డీఎస్పీ దేవవరప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.


ప్రభుత్వం తీసుకున్న చర్యలు

నగరంలో 14 ప్రాంతాల్లో (చౌడేశ్వరినగర్, లాలాచెరువు, కంబాలపేట, వీఎల్‌పురం, ప్రకాశంనగర్, రాజేంద్రనగర్, మోరంపూడి తదితరాలు) వైద్య శిబిరాలు ఏర్పాటు.

12 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాగునీరు పైపుల్లో లీకేజీలపై పరిశీలన, నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

వీధుల్లో లూజు పాలు విక్రయించే వ్యాపారులపై నిఘా పెంచారు. నమూనాలు సేకరించారు.

కల్తీ ఎలా జరుగుతోందంటే...

పాల కల్తీలో యూరియా, డిటర్జెంట్, వెజిటబుల్ కొవ్వులు, ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వంటి రసాయనాలు కలుపుతున్నట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడయ్యాయి. ఈ దురంతం పాడి రంగంపైనే ప్రభావం చూపుతోంది.

ప్రజలు ఏవైనా కల్తీ పాల సంబంధిత సమాచారం లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Read More
Next Story