
‘అవి నీరు కాదు, గరళం..’
కలుషిత నీటి సరఫరాపై మధ్య ప్రదేశ్ BJP ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్(Indore)లో కలుషిత తాగునీటి మరణాల( contamination deaths)పై కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. ఇది నీటి సమస్య కాదని.. ప్రజలకు నేరుగా విషాన్ని సరఫరా చేశారని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత BJP ప్రభుత్వానిదేనని అన్నారు.
‘అధికారులు పట్టించుకోలేదు..’
‘‘నీళ్లు కంపుకొడుతున్నాయని స్థానికులు కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫిర్యాదుపై సత్వరమే స్పందించి ఉంటే మరణాలు సంభవించేవి కాదు. తాగునీరు ఎలా కలుషితమైందన్న దానిపై ప్రభుత్వానికి ఇప్పటికీ క్లారిటీ లేదు. అధికారుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలు తీసింది’’ అని లోక్‌సభ ప్రతిపక్ష నేత ఆరోపించారు.
అసలు ఏం జరిగింది?
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్ నగరంలో తాగునీరు కలుషితమైంది. కలుషిత నీరు తాగిన స్థానికులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఇప్పటివరకు 8 నుంచి 9 మంది మరణించినట్టు అధికారిక వర్గాల సమాచారం. వందల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. తాగునీటి పైప్‌లోకి మురుగు నీరు చేరిందని ప్రాథమిక విచారణలో తేలింది. నీటి సరఫరాలో లీకేజీలు, డ్రైనేజ్ లైన్లు సమీపంలో ఉండటం వల్ల తాగునీరు కలుషితమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష కోసం సేకరించిన 50 నీటి నమూనాల్లో 26 నమూనాల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. పరిస్థితిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కలుషిత నీటి సరఫరాను నిలిపివేసింది. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేపట్టింది. ప్రజలు నీటిని మరిగించి మాత్రమే తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా స్పందించింది. మరణాలపై నివేదిక ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది.
మృతులకు పరిహారం..
ముఖ్యమంత్రి ఈ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందిస్తామని, ఆసుపత్రి చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర తనిఖీ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇందోర్ లాంటి ‘క్లీన్ సిటీ’గా పేరున్న నగరంలో తాగునీటి కలుషితం జరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పట్టణ మౌలిక వసతుల నిర్వహణ, పౌరుల ఆరోగ్య భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

