మెల్లిగా ‘ఫామ్ హౌస్’ వైపు కదులుతున్న ట్యాపింగ్ తీగ
x

మెల్లిగా ‘ఫామ్ హౌస్’ వైపు కదులుతున్న ట్యాపింగ్ తీగ

పెద్ద తలకాయలు అంటే ఎవరనే విషయంలో అనేక చర్చలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోను, ప్రభుత్వంలోను పెద్ద తలకాయలు ఉండేవే మూడు నాలుగు?


తెల్లవారేకొద్ది పొగమంచు విడిపోయినట్లుగా విచారణ లోతులకు వెళ్ళేకొద్ది టెలిఫోన్ ట్యాపింగ్ సూత్రదారుల పేర్లు మెల్లిగా బయటపడుతున్నట్లే ఉంది. ట్యాపింగ్ ఆరోపణలపై ఇప్పటికే డీఎస్పీ, అడిషినల్ ఎస్పీ స్ధాయి అధికారులు అరెస్టై చాలా విషయాలు చెప్పారు. అలాగే టాస్క్ ఫోర్స్ రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు తాజా వాగ్మూలంలో చెప్పిన విషయాలు సంచలనమవుతున్నాయి. విచారణలో ట్యాపింగ్ సూత్రదారులు బీఆర్ఎస్ లోని పెద్దలకాయలని చెప్పారు. దాంతో పెద్ద తలకాయలు అంటే ఎవరనే విషయంలో అనేక చర్చలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోను, ప్రభుత్వంలోను పెద్ద తలకాయలు చాలానే ఉన్నాయి.


పార్టీలో పెద్దతలకాయలంటే కేసీయార్, కేటీయార్, హరీష్ రావు, కవిత, సంతోష్ అని చెప్పాలి. కేసీయార్ రోజుల తరబడి ఎవరితోను టచ్ లో ఉండేవారు కాదు కాబట్టి పార్టీ వ్యవహారాల్లో ఆయనకు బదులుగా కొడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, కూతురు కవిత, మేనల్లుడు, మంత్రి హోదాలో హరీష్ రావు, మరో మేనల్లుడు, రాజ్యసభ ఎంపీ హోదాలో జోగినపల్లి సంతోష్ వ్యవహారాలు నెరిపేవారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇక ప్రభుత్వంలో కేసీయార్, కేటీయార్, హరీషే పెద్ద తలకాయలు. కాబట్టి పై ఐదుగురిలో ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలక సూత్రదారుగా వ్యవహరించింది ఎవరనే విషయంలో తెలంగాణా సమాజంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.


రాధాకిషన్ ఇంకేమి చెప్పారో ?


ట్యాపింగ్ ను అడ్డంపెట్టుకుని సూత్రదారు ఆదేశాల ప్రకారం తాము ఏ స్ధాయిలో అరాచకాలకు పాల్పడ్డామనే విషయాన్ని రాధాకిషన్ పూసగుచ్చినట్లు వివరించారు. విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. 2018 ఎన్నికలు, తర్వాత దుబ్బాక, మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలు ఆ తర్వాత మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దతలకాయ ఆదేశాల ప్రకారం తాము ప్రతిపక్షాలను ఏ విధంగా నియంత్రించేందుకు ప్రయత్నించామనే విషయాన్ని రాధాకిషన్ బయటపెడుతున్నారు. పెద్దతలకాయ నుండి పలానా అభ్యర్ధులపై కన్నేయమని ఆదేశాలు రావటమే ఆలస్యం వెంటనే సదరు అభ్యర్ధులు, నేతతో పాటు వాళ్ళ కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు రిటైర్డ్ డీసీపీ అంగీకరించారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేసింది, ఫోన్ సమాచారం ఆధారంగా తాము ఎవరెవరిపైన దాడులు జరిపింది, ఎంతెంత డబ్బులు సీజ్ చేసింది కూడా చెప్పారు.


ప్రతిపక్షాల్లోని నేతల ఫోన్లను, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ట్యాప్ చేయటం ద్వారా వాళ్ళ ఎన్నికల వ్యూహాలను, ఆర్ధిక వ్యవహారాలను తెలుసుకుని బాగా ఇబ్బంది పెట్టినట్లు అంగీకరించారు. హైదరాబాద్ సిటిలో బీఆర్ఎస్ కు పట్టుకోసం ప్రత్యేకంగా పెద్దతలకాయ తనను 2017లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని రాధాకిషన్ వివరించారు. టాస్క్ ఫోర్స్ లోని చాలామంది కీలక అధికారులను సామాజికవర్గం ప్రాతిపదికగానే నియమించారని కూడా మాజీ డీసీపీ అంగీకరించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు, తనతో పాటు మరికొందరు ఉన్నతాదికారులు ఒక బృందంగా ఏర్పడి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు ఏ విధంగా కృషిచేశామన్న విషయాన్ని కూడా మాజీ డీసీపీ తన వాగ్మూలంలో చెప్పారు.


మాజీ చీఫ్ ఎప్పుడొస్తారో ?




ప్రతిపక్షాల్లోని సుమారు 200 మంది ఫోన్లను తాము ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. ప్రతిపక్షాల్లోని కొందరు టార్గెటెడ్ లీడర్ల 24 గంటల కదిలకలపైన నిఘాపెట్టినట్లు కూడా రాధాకిషన్ అంగీకరించారు. లాజికల్ గా ఆలోచిస్తే పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా పెద్దతలకాయంటే కేసీయార్ అనే చెప్పాలి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకరరావు విచారణకు హాజరైతే కాని ఆ పెద్దతలకాయ ఎవరనే విషయంలో క్లారిటిరాదు. ఎందుకంటే పెద్దతలకాయకు, పోలీసు అధికారులకు మధ్య ప్రభాకరరావున్నారు కాబట్టే.


ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతు ట్యాపింగ్ ఆదేశాలిచ్చిన పెద్దతలకాయలు తొందరలోనే న్యాయవిచారణకు హాజరవ్వాల్సుంటుందని హెచ్చరించారు. విచారణలో పెద్దతలకాయ ఎవరనే విషయం బయటపడతుందన్నారు. తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నట్లుగా ప్రతిపక్షంలో ఉన్నపుడు తానుచేసిన ఆరోపణలను ఉత్తమ్ ఇపుడు గుర్తుచేస్తున్నారు. అక్రమంగా ఫోన్లను ట్యాప్ చేయటం దుర్మార్గమైన చర్యగా మంత్రి అభివర్ణించారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినందుకు పెద్దతలకాయ బాధ్యత వహించాల్సిందే, చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే అని తీవ్రంగా హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కల్వకుంట్ల కవిత జైలులో ఉన్నట్లే ట్యాపింగ్ కేసులో కూడా పెద్ద తలకాయ జైలుకు వెళ్ళక తప్పదని ఉత్తమ్ అన్నారు.


Read More
Next Story