మహిళలపై ఈవ్‌టీజర్ల వేధింపులు,కొరడా ఝళిపించిన షీ టీమ్స్
ఈ ఏడాది జరిగిన బోనాల ఉత్సవాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు లైంగికంగా వేధించారు.మహిళలను లైంగికంగా వేధించిన 305 మంది ఈవ్ టీజర్లపై షీ టీమ్స్ కొరడా ఝళిపించింది.
హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దేవాలయాలకు వచ్చిన మహిళా భక్తులను కొందరు ఆకతాయిలు లైంగికంగా వేధించారు. మహిళలను వేధించిన 289 మంది పెద్దలు, 16 మంది మైనర్ బాలురను షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి.
- మహిళలను లైంగికంగా వేధించిన 173 మంది కుటుంబ సభ్యులను పోలీసుస్టేషన్లకు పిలిపించి వారికి హెచ్చరిక జారీ చేసి, కౌన్సెలింగ్ చేసి భవిష్యత్ లో మహిళలను వేధించవద్దని చెప్పి వదిలిపెట్టారు.
- మహిళలను లైంగికంగా వేధించిన అయిదుగురు నిందితులను మెజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టగా, వారిని సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 292, బీఎన్ఎస్, 70 (సి) కింద దోషులుగా పరిగణించిన జడ్జి వారికి మూడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1050 జరిమానా విధించారు.
- బోనాల సందర్భంగా జరిగిన ఆకతాయిల వేధింపులతోపాటు జులై నెలలో షీ టీమ్స్ కు 115 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 19 కేసులు నమోదు చేశారు. ఇందులో నాలుగు పోక్సో యాక్ట్ కింద షీ టీమ్స్ కేసులు పెట్టింది.
- యువతులపై అత్యాచారం, ఛీటింగ్, పెళ్లి చేసుకుంటామని మోసం చేసిన కేసులను షీ టీమ్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
- హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి తెల్లవారుజామున క్యాబ్ లో ప్రయాణిస్తుండగా ఓ ప్రముఖ క్యాబ్ డ్రైవరు మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా, లైంగికంగా వేధించాడు. యువతి ఫిర్యాదు మేర షీ టీమ్ నిందితుడైన క్యాబ్ డ్రైవరును పట్టుకొని అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా జడ్జి క్యాబ్ డ్రైవరును దోషిగా పరిగణించి అతనికి ఆరు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1050 జరిమానా విధించారు.
బోనాల ఉత్సవాల్లో రెచ్చిపోయిన ఆకతాయిలు
హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ సందర్భంగా మహిళలపై జరిగిన వేధింపులపై షీ టీమ్ బృందాలు దృష్టి సారించి ఆకతాయిల ఆట కట్టించారు.తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో బోనాలు ఒకట.అత్యంత భక్తి,సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటారు. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా,బల్కంపేట్ సహా పలు ప్రాంతాల్లో బోనాలు జరుపుకుంది.ఈ బోనాల ఉత్సవాల్లో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారం షీ టీమ్ తెర మీదకు తీసుకువచ్చింది.
305 మంది ఈవ్ టీజర్ల అరెస్ట్
హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ సందర్భంగా మహిళా భక్తులను ఆటపట్టించిన ఆకతాయిల షీటీమ్ ఆట కట్టించింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు 305 మంది వ్యక్తులను షీ టీమ్ అరెస్టు చేసింది. వీరిలో 289 మంది పెద్దలు, 16 మంది మైనర్లు ఉన్నారు. ఫలితంగా, 173 మంది నిందితులను హెచ్చరించి వదిలేశారు.పండుగ సమయంలో పౌరులందరి, ప్రత్యేకించి మహిళల భద్రతకు భరోసా ఇవ్వడానికి షీ టీమ్స్ బృందాలు విశేషంగా పనిచేశాయి.
హాట్‌స్పాట్‌లపై షీ టీమ్స్ నిఘా
వీధుల్లో మహిళలు,యువతులపై లైంగిక వేధింపులు, ఆన్ లైన్, ఫోన్ వేధింపులు, అమ్మాయిల వెంటపడి వేధించడం లాంటి ఫిర్యాదులపై షీ టీమ్స్ సత్వరం స్పందించి చర్యలు తీసుకుంటున్నాయి.మహిళలు, బాలికలపై నేరాలు తరచుగా జరిగే ప్రాంతాలను ఈవ్ టీజింగ్ హాట్‌స్పాట్‌లుగా గుర్తించి షీ టీమ్ బృందాలు ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి ఈవ్ టీజర్లను పట్టుకున్నాయి.
రెడ్ హ్యాండెడ్ కేసులు
షీ టీమ్‌లు హాట్‌స్పాట్‌లలో మఫ్టీ దుస్తుల్లో నిఘా వేశారు. ఆకతాయిల లైంగిక వేధింపులను ఫోటోలు, వీడియోగ్రాఫిక్ ఆధారాలను సేకరించి, వాటి ఆధారంగా మహిళలు లేదా బాలికలనును వేధించే నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులు మైనర్ అయి నేరం తీవ్రత తక్కువగా ఉంటే, బాలుడికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి వారిని హెచ్చరిస్తారు.
పదేళ్ల షీ టీమ్ సేవలు
తెలంగాణలో షీ టీమ్ ను 2014 అక్టోబర్ 24వతేదీన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోనే తెలంగాణ షీ టీమ్ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. మొదట్లో హైదరాబాద్ నగరంలో ప్రారంభించి, తరువాత సైబరాబాద్‌లో,ఆ తర్వాత 2015 ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈ సేవలను విస్తరించారు. షీ భరోసా సైబర్ ల్యాబ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎన్ఆర్ఐ సెల్, మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. బాలికల అక్రమ రవాణ అరికట్టడం, గృహ హింస నివారణ, పనిప్రదేశాల్లో మహిళల సంరక్షణ కార్యక్రమాలపై షీ టీమ్ దృష్టి సారించింది.
మహిళలకు ఉమెన్ సేఫ్టీ వింగ్ భరోసా : షీకా గోయల్
తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ మహిళలు, బాలికలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి కట్టుబడి ఉందని షీ టీమ్ విభాగం ఐపీఎస్ అధికారిణి షీకాగోయల్ చెప్పారు. షీ భరోసా సైబర్ ల్యాబ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎన్నారై సెల్, మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్ ఆధ్వర్యంలో మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటుందని షీకాగోయల్ వివరించారు. దీని కోసం భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.
లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయండి: షీ టీమ్
తమపై జరిగే లైంగిక వేధింపులపై మహిళలు 100 నంబరు లేదా 94906 16555 నంబరుకు ఎమర్జెన్సీ వాట్సాప్ కాల్ ద్వారా ఫిర్యాదు చేయాలని షీటీమ్స్ డీసీపీ కవిత కోరారు. ఫిర్యాదులను నేరుగా లేదా సోషల్ మీడియా, వాట్సాప్ లేదా హాక్ ఐ యాప్ ద్వారా చేయవచ్చని ఆమె చెప్పారు.
Next Story