బురద గుంతలో కూర్చుని మహిళ వినూత్న నిరసన
x

బురద గుంతలో కూర్చుని మహిళ వినూత్న నిరసన

హైదరాబాద్ నాగోల్‌ లో ఓ సామాన్య మహిళ ఒంటరిగా చేపట్టిన నిరసన సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షించింది. ఆమె నిరసనకి అధికారులు కూడా దిగొచ్చారు.


హైదరాబాద్ నాగోల్‌ లో ఓ సామాన్య మహిళ ఒంటరిగా చేపట్టిన నిరసన సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షించింది. ఆమె నిరసనకి అధికారులు కూడా దిగొచ్చారు. రోడ్లు గుంతలు పడ్డాయి, ప్రయాణం చేయాలంటే ప్రమాదభరితంగా ఉంది మొర్రో అని మొరపెట్టుకున్నా అధికారుల్లో చలనం కరువైంది. సమస్య గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేనాధుడే లేడని చివరికి తానే పోరాటానికి స్వయంగా రంగంలోకి దిగింది. బురద గుంతలో కూర్చుని ఆందోళన చేపట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంటనే అధికారులు కూడా స్పందించారు.

వివరాల్లోకి వెళితే... ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్ నుంచి తట్టి అన్నారం వైపు వెళ్లే రోడ్డు గుంతలమయం అయ్యింది. ఇదే మార్గంలో కుంట్లూర్ కి చెందిన నిహారిక రోజూ నాగోల్ నుండి కుంట్లూర్ కి జర్నీ చేస్తుంటుంది. తన పిల్లలు కూడా ఇదే దారిలో స్కూల్ కి వెళుతుంటారు. గతంలో ఒకసారి గుంతల కారణంగా ఇదే దారిలో తన పిల్లలు కిందపడ్డారు. అప్పుడే ఆమె అధికారులకు కంప్లైంట్ చేసింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించకపోవడంతో విసుగు చెందిన ఆమె... గురువారం అదే మార్గంలో బురద నీటితో నిండిన గుంతలో కూర్చొని నిరసన చేసింది.

ట్యాక్సులు కడుతున్నాం... సౌకర్యాలు కల్పించండి...

నిరసన సందర్భంగా నిహారిక మాట్లాడుతూ... ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులు ప్రజలను రక్షించడం లేదని, ప్రజల ఫిర్యాదులను అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్డు మొత్తం గుంతలు పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల పరిస్థితి ఇలానే దారుణంగా ఉందన్నారు. ఇప్పటికైనా GHMC స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మేము ట్యాక్సులు కడుతున్నాం. మాకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై, ప్రభుత్వంపై ఉందని, సమస్య త్వరలో పరిష్కరించకపోతే ఇదే గుంతలో పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించింది. ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆ మహిళతో ఫోన్ లో మాట్లాడారు. త్వరలోనే రోడ్డు సమస్యని పరిష్కరిస్తామని, నిరసన విరమించాలని కోరారు. దీంతో ఆ మహిళ నిరసన విరమించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

Read More
Next Story