నాడు ఓ స్త్రీ రేపు రా..నేడు రిట్ పిటిషన్ల నంబర్ బోర్డులు
నాడు ఇంటి తలుపులకు ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ రాసి బోర్డులు వేలాడదీశారు.మళ్లీ నేడు హైడ్రా కూల్చివేతల భయంతో మూసీనివాసులు రిట్ పిటిషన్ల నంబరుబోర్డులు వేలాడదీశారు.
నాడు ఆడ దయ్యాలు తిరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోయారు.దయ్యాలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ప్రతీ ఇంటి ముందు తలుపులకు ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ బోర్డులు వేలాడదీయాలనే ప్రచారంతో ప్రతీ ఇంటి ముందు ఇలా బోర్డులు పెట్టిన విషయం సంచలనం రేపింది. ఆ తర్వాత ‘ఓ స్త్రీ రేపు రా’ పేరుతో తెలుగు సినిమా కూడా వచ్చింది.నేడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత హైడ్రా కూల్చివేతల భయం మూసీ తీర ప్రాంత నివాసులను అదే స్థాయిలో వణికిస్తోంది.
- మూసీ నదీ సుందరీకరణ పేరిట ప్రక్షాళన పనులు చేపట్టేందుకు మూసీ తీరంలోని ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలోని ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చివేసి, అక్కడ నివాసులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి అక్కడికి తరలిస్తోంది.
- హైడ్రా అన్నా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులన్నా మూసీ తీర ప్రాంత ఇళ్ల యజమానులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.భూములు కొని అప్పులు చేసి, నిర్మించుకున్న పక్కా ఇళ్లను అధికారులు కూలుస్తుండటంతో వందమందికి పైగా భవన యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు స్టే ఆర్డర్ల బోర్డులు...
వంద మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లను కూల్చివేయవద్దని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు.చైతన్యపురి, ఫణిగిరికాలనీ,సత్యనగర్,కొత్తపేట ప్రాంతాల ప్రజలు వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు స్టే ఆర్డర్లు ఇచ్చింది. అంతే అధికారులకు భయపడి ఆ స్టే ఆర్డర్ నంబర్లతో బోర్డులు రాసి ఇళ్ల ముందు వేలాడదీశారు.
- మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మళ్లీ కూల్చివేతలను మంగళవారం నుంచి అధికారులు పునర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ స్టే ఆర్డర్ల బోర్డులు అధికారుల కూల్చివేతలకు ఆటంకంగా మారాయని చెబుతన్నారు. మొత్తం మీద మూసీ తీర ప్రాంతంలో కూల్చివేతల భయం ఇక్కడి ఇళ్ల యజమానులను వణికిస్తోంది.
Next Story