విదేశీ పర్యటన సీఎం రేవంత్‌కు రాజకీయంగా లాభించేనా?
x

విదేశీ పర్యటన సీఎం రేవంత్‌కు రాజకీయంగా లాభించేనా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం విదేశాల్లో 11 రోజుల పాటు జరిపిన పర్యటన బుధవారం విజయవంతంగా ముగిసింది. సీఎం పర్యటన పర్యవసానం, రాజుకున్న రాజకీయ రచ్చపై..


అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 50 వ్యాపార సమావేశాలు, మూడు రౌండ్‌టేబుల్ సమావేశాలు, క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంది. సీఎం 19 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. మొత్తం రూ.31,500 కోట్ల పెట్టుబడులతో 30,750 కొత్త ఉద్యోగాలను సృష్టించారు.

- దక్షిణ కొరియా సియోల్‌లో రెండు రోజులు పర్యటించిన సీఎం ప్రతినిధి బృందం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, 25 ఇతర టెక్స్‌టైల్ కంపెనీల ఉన్నతాధికారులతో సమావేశమైంది.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా,దక్షిణ కొరియా దేశాల పర్యటన జరిగింది. ఆగస్టు 14వతేదీ వరకు సాగిన ఈ పర్యటనలో సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి,ఐటీ,పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.న్యూయార్క్,వాషింగ్టన్, డల్లాస్,శాన్‌ ఫ్రాన్సిస్కో,దక్షిణ కొరియా సీయోల్ నగరాల్లో పర్యటించారు.

నా పర్యటన విజయవంతం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడుల కోసం తాను చేసిన అమెరికా పర్యటన విజయవంతమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.

ది ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ
తెలంగాణలో ఉన్న నదులు, ప్రకృతి సిద్ధంగా ఉన్న వనరులు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలకు చెప్పారు.సీఎం తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పేర్కొంటూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేశారు.

సీఎం రేవంత్ బ్రాండ్ ఇమేజ్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన జరిపారు. రెండోసారి అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ లీడర్స్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల వద్ద పెట్టుబడుల కోసం కలిసి మాట్లాడారు. సూటు, బూటు లేకున్నా సింపుల్ గా ఉన్న సీఎం పెట్టుబడులతో వస్తే తాము ప్రభుత్వ పరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

మాస్ ఇమేజ్ నుంచి క్లాస్ ఇమేజ్...రేవంత్ సొంతం
మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్ విదేశీ పెట్టుబడులను సాధించి కేటీఆర్ ను తలదన్నేలా క్లాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారని విదేశీ పర్యటనల ద్వారా సీఎం రేవంత్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

హైదరాబాద్ కు పెరిగిన పెట్టుబడులు
సీఎం రేవంత్ రెడ్డి జరిపిన విదేశీ పర్యటనతో తెలంగాణకు గ్రోత్ కారిడార్ అయిన హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. ప్రపంచ స్థాయి పేరొందిన సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూకట్టాయి. సీఎం రేవంత్ తీసుకున్న చొరవతో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్నారైలు చేయూతనివ్వాలని సీఎం కోరారు.

హైదరాబాద్ అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం
ఇప్పటికే హైదరాబాద్ నగరాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు దీని బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు సీఎం అప్పగించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి సీఎం శ్రీకారం చుట్టారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి భూసేకరణ ప్రారంభించారు. ఏఐ సిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.అయితే తాజాగా సీఎం రేవంత్ చేపట్టిన అభివృద్ధి పనులతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించేందుకు వీలుగా హైదరాబాద్ అభివృద్ధి ఉపయోగపడే అవకాశముందని హైదరాబాద్ నగరానికి చెందిన సోషల్ యాక్టివిస్టు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లూబ్నా సర్వత్ చెప్పారు.

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
దక్షిణ కొరియా దేశం సీయోల్ నగరంలోని చియోంగ్జీ చెయోన్ నది తీరాన్ని ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వేగా అభివృద్ధి చేశారు. సుందరమైన వాటర్ ఫ్రంట్ ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అదే తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం అభినందించదగ్గ విషయమని ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు వ్యాఖ్యానించారు.

రేవంత్ ఒప్పందాలు అమలైతే ప్రజలు అభినందిస్తారు...
విదేశీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు అమలు అయితే ప్రజలు అభినందిస్తారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో కేటీఆర్ పెట్టుబడుల పేరిట విదేశీ పర్యటనల కోసం రూ.40 కోట్లు ఖర్చు చేశారని, కానీ వచ్చిన పెట్టుబడులు మాత్రం అంతంత మాత్రమేనన్నారు. హైదరాబాద్ నగరం శాంతియుతంగా, వాతావరణం అనుకూలంగా ఉండటంతోపాటు వనరులున్నందు వల్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పద్మనాభరెడ్డి చెప్పారు.

సీఎం పర్యటన విజయవంతం : విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి జరిపిన విదేశీ పర్యటన విజయవంతం అయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. సీఎం అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏ కంపెనీకి కూడా అంగుళం భూమి కేటాయించక ముందే మనీలాండరింగ్ జరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించడం హ్యాస్యాస్పదమన్నారు.

కేటీఆర్ జల్సాలు చేశారు...
గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్పారు. కేటీఆర్ లాగా జల్సాలు చేసేందుకు సీఎం విదేశాలకు వెళ్లలేదని ఆయన ఆరోపించారు. కేటీఆర్ గతంలో చైనా, సింగపూర్ దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎంపీ మల్లు రవి కొట్టిపారేశారు.

సీఎం పర్యటనపై రాజుకున్న రాజకీయ రచ్చ
పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి జరిపిన విదేశీ పర్యటన రాష్ట్రంలో రాజకీయ రచ్చను రాజేసింది. సీఎం జరిపిన పర్యటన విజయవంతం అయిందని కాంగ్రెస్ నేతలు ప్రకటించగా, విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సీఎం పర్యటన వల్ల కుదరిన ఒప్పందాలు బోగస్ వని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రపంచ బ్యాంకుతో రేవంత్ భేటీపై విమర్శలు
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై తెలంగాణకు చెందిన ఆర్థిక నిపుణులు పాపారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని, ఆయన బాటలో రేవంత్ పయనించడంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రపంచ బ్యాంకు విధించే షరతులను అంగీకరిస్తే ప్రజలపై పన్నుల రూపంలో భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని, హైదరాబాద్ నగరంలో తరచూ కరెంటు పోతుందని పాపారావు ఆరోపించారు. గతంలో కంటే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. రేవంత్ ఇమేజ్ విదేశీ పర్యటన వల్ల పెరగలేదని చెప్పారు.

కేటీఆర్ విమర్శలు
అమెరికా దేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలన్నీ బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం షెల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. పెట్టుబడుల పేరిట షెల్‌ కంపెనీలు, స్కాంగ్రెస్‌ ఎత్తుగడలతో ప్రజలను మోసగిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి సోదరుడు నెల రోజుల్లో పెట్టిన స్వచ్ఛ్‌ బయో కంపెనీ ఇదే కోవలోనిదే. ఇది ఆరంభం మాత్రమే! ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి' అని పేర్కొన్నారు.రేవంత్‌ చేసుకునే ఒప్పందాల కంపెనీలన్నీ బోగస్ అని.. ఆ ఒప్పందాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు.

సీఎం పర్యటనలో కుదిరిన అవగాహన ఒప్పందాలు
- కాగ్నిజెంట్: అమెరికా వెలుపల హైదరాబాద్‌లో అతిపెద్ద సామర్థ్యం ఉన్న కార్యాలయం ఏర్పాటు, ​​15,000 ఉద్యోగాలను సృష్టి.
-వాల్ష్ కర్రా హోల్డింగ్స్: వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి వీ-హబ్‌లో 5 మిలియన్ డాలర్లు, స్టార్ట్-అప్‌లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.
-6ఆర్సీసియం: యూఎస్ వెలుపల హైదరాబాద్‌లో మొదటి శాఖ ఏర్పాటు, 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాల సృష్టి.
- స్వచ్ఛ బయో: 500 ఉద్యోగాలకు రూ.1,000 కోట్ల పెట్టుబడి.
- ట్రిజిన్ టెక్నాలజీస్: హైదరాబాద్‌లో ఏఐ ఇన్నోవేషన్, డెలివరీ సెంటర్, 1000 ఉద్యోగాల సృష్టి.
- హెచ్ సీఏ హెల్త్‌కేర్: 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ.
- కార్నింగ్: 2025లో ఉత్పత్తిని ప్రారంభించడానికి గాజు గొట్టాల సౌకర్యం.
- ప్రపంచ బ్యాంక్: ప్రధాన కార్యక్రమాలపై సహకారం.
- వివింట్ ఫార్మా: 1,000 ఉద్యోగాలకు రూ.400 కోట్ల పెట్టుబడి.
- చార్లెస్ స్క్వాబ్: భారతదేశంలో మొదటి సాంకేతిక అభివృద్ధి కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ
- హైదరాబాద్‌లో సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జోయిటిస్ ఇంక్.
- హ్యుందాయ్ మోటార్ కంపెనీ మెగా టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటు
- దక్షిణ కొరియాలోని 25 ప్రధాన టెక్స్‌టైల్ కంపెనీలు తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

Read More
Next Story