KOUSHIK REDDY | వివాదాలకు కేరాఫ్ కౌశిక్‌రెడ్డి,పీడీ యాక్ట్ పెడతారా ?
నిత్యం వివాదాలతో, ఫైర్ బ్రాండ్ లీడరుగా పేరొందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలుస్తుంటారు.ఈయనపై సర్కార్ పీడీ యాక్ట్ పెడతారని చెబుతున్నారు.
కరీంనగర్ లో జరిగిన ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో దురుసుగా ప్రవర్తించడంతోపాటు అతన్ని చేత్తో నెట్టివేసిన కేసులో నిందితుడైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA KOUSHIK REDDY )సోమవారం రాత్రి అరెస్ట్ చేసి అతన్ని కరీంనగర్ లోని త్రీ టౌన్ పోలీసుస్టేషనుకు తరలించారు.
- కరీంనగర్ వన్ టౌన్ లో మూడు త్రీ టౌన్ పోలీసుస్టేషనులో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి కౌశిక్ రెడ్డిని త్రీటౌన్ కు తరలించారు. డాక్టర్ సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఇతనిపై 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండుగ రోజు ఎమ్మెల్యే అరెస్టుతో కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
- కౌశిక్ రెడ్డికి మంగళవారం ఉదయం పోలీసుస్టేషనులోనే వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జడ్జి ముందు హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. సోమవారం రాత్రి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, లీగల్ టీం న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసుస్టేషనుకు వచ్చారు. ఆయన అక్కడ లేకపోవడంతో ధర్నా చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తపల్లి పోలీసుస్టేషనుకు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తారనే సమాచారం మేర పోలీసులు కరీంనగర్ లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ క్రికెటరుగా...
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి 2004 నుంచి 2007వ సంవత్సరం వరకు తెలంగాణలో 15 కీలక క్రికెట్ మ్యాచ్ లు ఆడారు. అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌశిక్ 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈటెల రాజేందర్ పై ఓటమి పాలయ్యారు. అనంతరం 2021 జులై 21వతేదీన కౌశిక్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఎమ్మెల్సీగా...
కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించారు. పార్టీలో చేరిన ఈయనకు 2021 జులై 21వతేదీన సోషల్ సర్వీస్ కేటగిరి కింద గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ప్రతిపాదనలు పంపించింది. గవర్నర్ కోటాలో సోషల్ సర్వీస్ కోటా కింద కౌశిక్ రెడ్డిని తాను నియమించలేనని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. దీంతో అప్పటి మహిళా గవర్నరుపై కౌశిక్ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేశారు. అనంతరం 2021 ఎమ్మెల్యేల కోటా కింద కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం ఎన్నికయ్యేలా చేసింది.
హుజురాబాద్ ఎమ్మెల్యేగా...
2023వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా హుజురాబాద్ నుంచి బరిలోకి దిగిన కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యే అయ్యాక తరచూ వివాదాలకు నిలయంగా మారారు. మొత్తం మీద తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, హెచ్చరికలను జారీ చేస్తూ ఫైర్ బ్రాండ్ లీడరుగా పేరొందిన కౌశిక్ రెడ్డి పై పీడీ యాక్ట్ నమోదు చేయడం ద్వారా ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఈయనపై పీడీ యాక్ట్ పెడతారా, కరీంనగర్ పోలీసులు పెట్టిన కేసులో జైలుకు వెళతారా లేదా అనేది కోర్టు నిర్ణయం కోసం వేచిచూడాల్సిందే.
- ఎన్నెన్నో వివాదాలు...
తెలంగాణ అప్పటి మహిళా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆక్షేపించింది.
- హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తనను గెలిపించకుంటే తన విజయయాత్రనో, లేదా శవయాత్రనో చూస్తారని ప్రజలను హెచ్చరించారు.
- గిరిజన మంత్రి అయిన సీతక్కపై కూడా కౌశిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- మానుకోట రాళ్ల దాడి ఘటనలోనూ కౌశిక్ పాత్ర ఉంది.
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీతో కౌశిక్ ఘర్షణకు దిగారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసుస్టేషనుకు వచ్చి అక్కడి ఇన్ స్పెక్టరును విధుల్లో అడ్డుకొని హంగామా సృష్టించారు. దీనిపై బంజారాహిల్స్ ఇన్ స్పెక్టరు ఎమ్మెల్యేపై కేసు పెట్టారు.
- ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరించారు. పేపర్లు చింపి సభ్యులపై వేశారు. స్పీకర్ కౌశిక్ ను హెచ్చరించినా అతని ప్రవర్తన మారలేదు.
- కౌశిక్ రెడ్డి సైకోలా వ్యహరిస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా హుందాగా ప్రవర్తించడం లేదని పలువురు ఆరోపించారు.
కేసులు పెట్టినా పోరాటం ఆగదు : పాడి కౌశిక్ రెడ్డి
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజల పక్షాన మీ అక్రమాలపై పోరాటం ఆగదని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు. సంక్రాంతి పండుగ రోజు తనను అరెస్ట్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజల పక్షాన మీ అక్రమాలపై పోరాటం ఆగదు ❗️ pic.twitter.com/bOoSyhYXPq
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 14, 2025
Next Story