ఈసారైనా కేసీఆర్ సహకరిస్తారా?
x

ఈసారైనా కేసీఆర్ సహకరిస్తారా?

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ కి నూతన చైర్మన్ ని నియమించింది.


తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ కి నూతన చైర్మన్ ని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ ని చైర్మన్ గా నియమిస్తూ మంగళవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ కి కొత్త చైర్మన్ ని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి... జులై 16 న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం కొత్త చైర్మన్ నియమించింది. కాగా, విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ని రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై జులై 16 న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక తీర్పు వెల్లడించారు. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని మార్చి విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

కేసీఆర్ సహకరిస్తారా?

కేసీఆర్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కమిషన్ చైర్మన్ ని మార్చాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే, గత కమిషన్ విచారణ ఆగిన చోట నుంచే కొత్త కమిషన్ విచారణ కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. గతంలో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ సందర్భంగా 15 మంది సాక్ష్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లను జస్టిస్ లోకూర్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అసలు విద్యుత్ విచారణ కమిషన్ అవసరమే లేదని వాదిస్తున్న కేసీఆర్ ఈసారైనా విచారణకి సహకరిస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.

ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా...

జస్టిస్ మదన్ భీంరావ్ లోకూర్ ఫిబ్రవరి 13, 2010 నుంచి మే 21, 2010 వరకు ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. తరువాత జూన్ 24, 2010 న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడ నవంబర్ 14, 2010 వరకు కొనసాగారు. ఆయన నవంబర్ 15, 2011 నుంచి జూన్ 3, 2012 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు కొనసాగించారు. జూన్ 4, 2012 న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా విధులలో చేరి... 2018 డిసెంబర్ లో రిటైరయ్యారు.

సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్..

బీఆర్ఎస్ హయాంలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపించింది. వీటిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో కూడిన కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ వెంటనే విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా కమిషన్ కేసీఆర్ కి నోటీసులు పంపింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

కమిషన్ ఇచ్చిన నోటీసులపై స్పందించిన కేసీఆర్.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. తమ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయ మార్పు చూపించామన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ని అందించామన్నారు. ఆ తరువాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఆయన వేసిన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు జూన్ 28న విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా... ప్రభుత్వం, కేసీఆర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం జులై 1న కేసీఆర్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కమిషన్ ఏర్పాటును సమర్ధిస్తూ... విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విచారణకి హాజరవ్వాలంటూ కమిషన్ నోటీసులు ఇచ్చిన మేరకు కేసీఆర్ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆయన మొదటి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని తప్పుబడుతూ ఉన్నారు. దీంతో ఆయన హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

కమిషన్ చైర్మన్ ని మార్చండి...

విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు జులై 16న విచారణ జరిపింది. కేసీఆర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి, ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. జ్యుడీషియరీ కమీషన్ నియామకం చట్ట ప్రకారం జరగలేదని ఆయన వాదించారు. మాజీ సీఎం పిటిషన్ ను పూర్తిగా విచారణ చేయకముందే హైకోర్టు కొట్టేసిందని తెలిపారు. తాము రిప్లై ఇవ్వకుండానే పిటిషన్ డిస్మిస్ చేసిందన్నారు. జ్యుడీషియరీ కమీషన్ ఛైర్మెన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎంక్వైరీ పూర్తవ్వకముందే జస్టిస్ నరసింహా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కేసీఆర్ తప్పు చేశారని చెప్పినట్లు కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తవ్వకముందే కేసీఆర్ ని దోషిగా తేలుస్తున్నారని ముకుల్ రోహత్గా వాదించారు.

అయితే, నరసింహారెడ్డి ప్రెస్ మీట్ లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో విద్యుత్ ఇబ్బందులు ఉండటంతో ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రూ.3:90 పైసలకు యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. అయితే ఓపెన్ బిడ్డింగ్ వేయకుండా నెగోషియేషన్ ప్రకారం ఎందుకు పవర్ కొన్నారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించగా.. అత్యవసర సమయంలో టెండర్లు వేయకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.

కేసీఆర్ తో పాటు ఇతర విద్యుత్ అధికారులకు నోటీసులు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల జూన్ 30 వరకు రిప్లై ఇవ్వలేమని కేసీఆర్ చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మిస్తుంటే, భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకి వ్యయం పెరిగిందని ఆయన కోర్టుకి తెలియజేశారు.

ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. ప్రెస్ మీట్ లో జస్టిస్ నరసింహారెడ్డి తన సొంత ఒపీనియన్ చెప్పినట్లు అనిపిస్తుందన్నారు. విచారణ జరుగుతున్న టైమ్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు కదా అని ప్రశ్నించారు. జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. కొత్త చైర్మన్ ను నియమించి విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.

జస్టిస్ నరసింహారెడ్డి లేఖ...

జులై 16 న కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరుపుతోన్న సుప్రీం కోర్టు... వాదనల అనంతరం కమిషన్ చైర్మన్ ని మార్చాలని ప్రభుత్వానికి ఆదేశించింది. భోజన విరామం అనంతరం తుది విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. అయితే లంచ్ బ్రేక్ సమయంలోనే జస్టిస్ నరసింహారెడ్డి ఓ న్యాయమూర్తి ద్వారా సుప్రీం కోర్టుకి లేఖ పంపారు. తాను విద్యుత్ విచారణ కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. "నేను ఎక్కడా పక్షపాత ధోరణి తో వ్యవహరించలేదు. రోజు మార్చి రోజు కమిషన్ ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేసింది. మీడియా సమావేశం ఏర్పాటు చేయకుంటే పత్రికల్లో ఊహాజనిత సమాచారం రాస్తున్నారు. కమిషన్ గురించి తమకు నచ్చినట్టు రాస్తున్నారు కాబట్టే మీడియా సమావేశం ఏర్పాటు చేశాము. కమిషన్ విచారణ బహిరంగంగా జరగాలి కాబట్టి పబ్లిక్ నోటీస్ ఇచ్చాము. ఒక జస్టిస్ హోదాలో ఉన్న నాకు ఎలాంటి పక్షపాతం లేదు. ఒకవేళ పక్షపాత ధోరణినీ అంటగడితే , న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతుంది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు నేను కమిషన్ నుండి తప్పుకుంటున్నా" అని ఆయన లేఖలో తెలిపారు.

Read More
Next Story