Singapore Tour |సీఎం సింగపూర్ టూర్,హైదరాబాద్‌కు పెట్టుబడులు వచ్చేనా?
x

Singapore Tour |సీఎం సింగపూర్ టూర్,హైదరాబాద్‌కు పెట్టుబడులు వచ్చేనా?

సింగపూర్ దేశంలో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన పర్యటన హైదరాబాద్ కు పెట్టుబడుల వరద పారుతుందా? అంటే అవునంటున్నారు రైజింగ్ టీం.సింగపూర్ లో జరిగిన ఒప్పందాల వివరాలివి...


తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సింగపూర్ దేశంలో సాగిన తెలంగాణ రైజింగ్ టీం పర్యటన సాగింది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో సీఎం బృందం విస్తృత చర్చలు జరిపింది.

- మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, స్థిరమైన హరిత ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి,ఐటీ పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం,దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు.
- సింగపూర్ లో జరిగిన ఒప్పందాలతో తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల వరద పారుతుందా ? లేదా అనేది వేచి చూడాల్సిందే.

హైదరాబాద్‌లో రూ. 450 కోట్లతో ఐటీ పార్కు
సింగపూర్ దేశానికి చెందిన క్యాపిటాల్యాండ్ గ్రూపు హైదరాబాద్ నగరంలో రూ.450 కోట్ల పెట్టుబడితో మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్కు (Hyderabad IT Park)నిర్మించేందుకు ముందుకు వచ్చింది. క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటనలో ఆదివారం ఒప్పదం కుదుర్చుకుంది.

రూ.3,500కోట్లతో గ్లోబల్ డేటా సెంటర్
ముచ్చర్లలోని మీర్ ఖాన్ పేటలో రూ.3500 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ రెడీ క్యాంపస్ నిర్మాణానికి ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా తెలంగాణ రాస్ట్రప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ ను నిర్మించనుంది.ఈ పెట్టుబడుల రాకతో డిజిటల్, ఏఐ రంగాల్లో తెలంగాణ ముందడుగు వేయనుంది.

తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం
సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమై తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై విస్తృత చర్చలు జరిపారు.పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు - నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని సింగపూర్ మంత్రి హామీ ఇచ్చారు.

స్కిల్ డెవలప్ మెంటుపై ఒప్పందం
సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని సందర్శించారు.తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ పట్ల అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సింగపూర్ ముందుకు వచ్చింది. సింగపూర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్ సాంకేతిక కేంద్రంగా నిలుస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
క్యాపిటాల్యాండ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఐటీ పార్కు ఏర్పాటుతో హైదరాబాద్ నగరం సాంకేతిక కేంద్రంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యాధునిక డేటా సెంటరు నిర్మాణం వల్ల హైదరాబాద్ ప్రపంచంలోనే డేటా సెంటర్ల రాజధానిగా మారనుందని సీఎం పేర్కొన్నారు. సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.




Read More
Next Story