KTR | ‘మహిళా సంఘాలకు ఫిర్యాదు చేస్తాం’
x

KTR | ‘మహిళా సంఘాలకు ఫిర్యాదు చేస్తాం’

ఆశా వర్కర్లపై పోలీసులు చేసిన దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీనే గుర్తు చేసిందుకు దాడులు చేయిస్తారా అని మండిపడ్డారు.


రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహ వివాదం తీవ్ర స్థాయిలో ఉంది. కాగా సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై చర్చలు జరుగుతున్న క్రమంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కోఠిలో ఆశా వర్కర్ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు అక్కడకు చేరి తమకు హామీల్లో చెప్పిన విధంగా గౌరవవేతనం రూ.18 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం(BRTU) ఆధ్వర్యంలో జరిగింది. కాగా వారిపై పోలీసులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలన్న విచక్షణ మరిచి మరీ తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసాచారి ఇద్దరూ కూడా ఆశా వర్కర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, నోటికొచ్చినట్లు తిన్నారని కూడా ఆశా వర్కర్లు తెలిపారు. పోలీసులు చేసిన దాడిలో పలువరు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశా వర్కర్లపై దాడులు చేసిన పోలీసుల అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకనయ్యారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాళ్లు యోధులు

‘‘కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ సేవలు అందించిన వాళ్లు ఆశా వర్కర్లు. వాళ్లు పొట్టకూటికోసం ఏదో పనిచేసుకునే వారు కాదు.. యోధులు. వారికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామాలను గుర్తు చేసినందుకు దాడులు చేయిస్తారా. ఆశా వర్కర్లపై దాడి అత్యంత హేయమైన చర్య. ఈ అంశంపై మానవ హక్కుల సంఘం, మహిళా సంఘాలకు ఫిర్యాదులు ఇస్తాం. ఆశా వర్కర్ల తరుపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఆశా వర్కర్లకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు వారికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. ఆశా వర్కర్లు ఇప్పుడేదో కొత్తగా డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఏదైతే ఇస్తామని చెప్పిందే.. దాన్ని ఇవ్వాలని వాళ్లు కోరారు’’ అని మండిపడ్డారు కేటీఆర్.

దుశ్శాసన పర్వం చూశాం..

‘‘మగ పోలీసులు వచ్చి మహిళలను లాగి అవతలేస్తుంటే తెలంగాణలో తొలిసారి దుశ్శాసన పర్వం చూశాం. ఇదేనా హోంశాఖ తీరు.. సీఎం రేవంత్. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టెలో చెప్పిన మాట వాస్తవం కాదా. మీరు చెప్పిన మాటనే కాదా ఇప్పుడు వాళ్లు గుర్తు చేశారు. శాంతియుతంగా చేస్తుంటే.. మీరు చేసిన దమనకాండను రాష్ట్రమంతా చూసింది. వారిపై ఇష్టం వచ్చినట్లు భౌతిక దాడులు చేశారు. పోలీసులు అయ్యుండి ఇంత నీఛంగా ప్రవర్తించారు. పోలీసులు ఇంతటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తుంది’’ అని నిలదీశారు.

Read More
Next Story