దామగుండం ముప్పుపై తెలంగాణ ‘మేధావులు’ మౌనం వీడరా?
x

దామగుండం ముప్పుపై తెలంగాణ ‘మేధావులు’ మౌనం వీడరా?

లక్షలాది చెట్లు.. మూసీ, ఈసీ నదుల జన్మస్థానం, నగరానికి ఆక్సిజన్ మాస్క్ వంటి దామగుండ రిజర్వ్ ఫారెస్ట్ లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని పర్యావరణవేత్తలు..


‘సేవ్ దామగుండం.. పర్యావరణాన్ని కాపాడండి.. మూసీని పరిరక్షించండి’ అంటూ పర్యావరణ వేత్తలు, కొంతమంది స్థానికులు వికారాబాద్ జిల్లా దామగుండం ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు. ఇండియన్ నేవీ నెలకొల్పబోయే ఈఎల్ఎఫ్ (RaRaఈ ప్రదేశంలో వద్దని, ఇక్కడ అరుదైన వందల ఏళ్ల నాటి మొక్కలు, వృక్షాలు ఉన్నాయని, హైదరాబాద్ నగరం నుంచి వస్తున్న కాలుష్యాన్ని అడ్డుకుని ప్రాణ వాయువును అందిస్తోందని పర్యావరణ వేత్తలు వాదిస్తున్నారు.

కొంతమంది పర్యావరణ వేత్తలు వయనాడ్ వరదలను ఉదహరిస్తున్నారు. ఇక్కడ నేవీ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 12 లక్షల చెట్లపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల వర్షాలతో నీరు వేగంగా మూసీలోకి అటు నుంచి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతుందని పేర్కొంటున్నారు. అయితే ఇంత జరుగుతున్న ప్రజల నుంచి దామగుండం పై స్పందన రావట్లేదు. అదే పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది.

నేవీ రాడార్ కేంద్రం ఎందుకు..
హిందూ మహా సముద్రంలో శత్రు దేశాల నౌకల సంచారాన్ని కనుగొనడానికి ఓ కేంద్రం కావాలని, అందుకు అప్పటి రంగారెడ్డి జిల్లా దామగుండం అటవీ ప్రాంతం వ్యూహత్మకంగా ఉందని నేవీ 2008 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసింది.
ఇప్పటికే తమిళనాడులో తిరునల్వేలిలో ఐఎన్ఎస్ కట్ట బొమ్మన్ వద్ద వీఎల్ఎఫ్ కేంద్రం ఉంది. దీనిని 1990 ల దశకంలోనే ఏర్పాటు చేశారు. అయితే దాని హిందూ మహా సముద్రంలో నౌకల సంచారం పెరిగిన నేపథ్యంలో దాని సేవలు సరిపోకపోవడంతో రెండో కేంద్రం కావాలని నేవీ అన్వేషణ మొదలు పెట్టింది.
అందులో భాగంగా విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం దామగుండం తమ అవసరాలకు సరిపోతుందని నిర్ధారించుకుంది. దీనికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి క్లియరెన్స్ ఇచ్చారు. పర్యావరణ శాఖ కూడా అన్ని అనుమతులు మంజూరు చేసింది.
అయితే పర్యావరణవేత్తలు దామగుండం నేవీకి అప్పగించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అలా 2020 లో హైకోర్టు స్టే ఇచ్చింది. తిరిగి 2023 లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనేక అంశాలను పరిగణలోని తీసుకుని తుది అనుమతులు మంజూరు చేసింది. అలాగే ఇక్కడ నెలకొల్పే నావీ రాడార్ కేంద్రాన్ని వీఎల్ఎఫ్ నుంచి ఈఎల్ఎఫ్ స్థాయికి తగ్గించింది. అప్పటికే అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ జీఓ నంబర్ 44 మంజూరు చేసి నేవీకి భూమిని అప్పగించడానికి సిద్ధమైంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 2900 ఎకరాల భూమిని నేవీ కి అప్పగించేందుకు అంగీకరించింది. ఈ నెల 15న ఈ ప్రాజెక్ట్ ను శంకుస్థాపన జరగడానికి వేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేవల్ కేంద్రాన్ని 2027 లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



రాడార్ కేంద్రం చుట్టూ 27 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన్ని నిర్మించబోతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే టౌన్ షిప్ లో పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, దాదాపు 3000 మంది దాకా నివసిస్తారని, 300 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని నేవీ చెబుతున్న మాట. అలాగే నరికిన ప్రతి చెట్టుకు ఐదు మొక్కలను నాటి సంరక్షిస్తామని నేవీ కోర్టుకు తెలియజేసింది.
ప్రకృతి ప్రేమికుల మాటేంటీ ?
‘‘ మేము నేవీ కేంద్రానికి వ్యతిరేకం కాదు.. దేశం లో ఎంతో స్థలం ఉంది. అక్కడ ఏర్పాటు చేసుకోండి.. ఎందుకు నదీ జన్మస్థానం దగ్గర ఈ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.’’ అని ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆయన ది ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ.. ఎక్కడైతే నదీ జన్మస్థానం ఉందో అది పర్యావరణ సెన్సిటీవ్ ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. దామగుండం కూడా అదే పరిధిలో ఉంది. అక్కడే మూసీ, ఈసీ నదులు జన్మించాయి ’’ అని వివరించారు.
అసలే అది రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం, అక్కడ టౌన్ షిప్ ఏర్పాటు చేసి, జనాలు నివాసం ఉండడం పర్యావరణానికి హనీ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్కరి సమస్యో కాదు.. ప్రజలందరిది. ఇది ప్రాంతాలకు అతీతమైనదన్నారు. ‘‘ నా చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్తుంటాను. అది హైదరాబాద్ సిటీకి ఆక్సిజన్ మాస్క్, వేల ఔషధ మొక్కలు, వందల ఏళ్ల నాటి చెట్లు దామగుండంలో ఉన్నాయి’’ అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రజలకు పర్యావరణం గురించి వివరించి చైతన్యం చేస్తున్నామని వివరించారు.
నేవీ రాడార్ కేంద్రం ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేయాలి, వేరే ప్రదేశం అంటే అడవులు లేని ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవవచ్చు కదా వికారాబాద్ జిల్లాకు చెందిన పర్యావరణ ప్రేమికుడు కొండ ఆకాశ్ మాట. ఆయన ది ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ.. ‘‘ మా ప్రాంతంలో ఉన్నవి కాస్తంత అడవులు, వాటిని కూడా లేకుండా చేయాలని అనుకోవడం సబబుగా లేదు’’ అని అభిప్రాయపడుతున్నారు.
పంటలు పండని భూములు, బీడు భూములు లేదా అడవులకు దూరంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. పర్యావరణం కాపాడాలని గొంతెత్తితే తమపై దేశ వ్యతిరేకులు అనే ముద్ర వేస్తున్నారని ఇది అన్యాయం అని వాదిస్తున్నారు. మేము నావీ కేంద్రానికి వ్యతిరేకం కాదని, అడవుల్లో కాకుండా ఇదే ప్రాంతంలో ఉన్న వేరు భూముల్లో ఏర్పాటు చేసుకోవచ్చమని చెబుతున్నామని ఆకాశ్ అంటున్నారు. దాదాపు రెండు లక్షల చెట్లను తీసివేస్తారని ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనుకూల.. వ్యతిరేక వర్గాలు..
దామగుండం పై పర్యావరణ ఉద్యమాలు ఇప్పుడిప్పుడే కాలు చేయి కూడదీసుకుంటున్నాయి. ఇందులో కొంతమంది ఆక్టివ్ గా నాయకత్వం వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ నాడు ప్రముఖ యూట్యూబర్ అక్కడ బతుకమ్మ ఆడించి ప్రజలను ఉద్యమంలో భాగం చేయడానికి ప్రయత్నించారు.
అలాగే అక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా భక్తులకు ఆక్సెస్ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతం మొత్తం ఒకప్పుడు రామలింగేశ్వర స్వామి ఆలయానికే సంబంధించిందే అని తరువాత ఎండోమెంట్ డిపార్ట్ మెంట్, తరువాత అటవీశాఖకు బదిలీ చేసి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంగా ప్రకటించారని వీరు చెబుతున్నారు. వెంటనే నావీ రాడార్ కేంద్రాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.
నేవీ రాడార్ కేంద్రానికి అనుకూలంగా కొన్ని వర్గాలు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఉద్యమాలు చేసేదంతా కమ్యూనిస్టు సానుభూతి పరులని, వీరంతా పర్యావరణవేత్తలుగా ఎప్పుడు మారారని ప్రశ్నిస్తున్నారు. కమ్యూనిస్టు సానుభూతి పరులకు గుళ్ల మీద అంత ప్రేమ ఎప్పుడు పుట్టిందని సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు.
నయిమ్ ముఠా, అంతకుముందు ఇదే ప్రాంతంలో మొద్దు శ్రీను ముఠా ఇక్కడే తమ అసాంఘిక కార్యకలాపాలకు ప్రాక్టీస్ గా దామగుండం అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నాయని, తరువాత హోటల్లు, రిసార్టుల యజమానుల కోసం ఇక్కడ ఓ కృత్రిమ ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయని, నేవీ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేస్తే వారి అసాంఘిక వ్యాపారాలకు తెరపడుతుందనే నాటకాలు ఆడుతున్నాయని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.
‘‘ ఉద్యమాలలో లెప్ట్, రైట్, ఆంధ్ర, తెలంగాణ వంటి సంకుచిత భావాలను విడిచిపెట్టండి. ఇది ధరిత్రికి సంబంధించింది. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించిన మార్పులను చూస్తున్నాం. మూసీ నదీ సుందరీకరణ చేస్తున్నారు. అసలు మూసీ ఉనికే ప్రమాదంలో పడింది.’’ అని పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి మాట.
ఓయూ జేఏసీ నాయకుల మాట..
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ కేంద్రం ఏర్పాటు చేయడం సబబుగా లేదని ఓయూ జేఏసీ నాయకుడు గుగులోతు రాజేష్ నాయక్ అభిప్రాయపడ్డారు. సమాజం ఈ విషయంపై నిర్లిప్తంగా ఉందన్న విషయాన్ని అంగీకరిస్తునే.. ప్రజా సంఘాలు దీనిపై క్షేత్ర స్థాయి నుంచి ఉద్యమాలు నిర్మించడంలో విఫలమయ్యాయని అన్నారు.
దాదాపు పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాజెక్ట్ విషయం గురించి చర్చలు జరుగుతున్న ప్రజలకు పూర్తి విషయాలు వివరించలేదన్నారు. ‘‘ ఇక్కడ విషయం ఏంటంటే బాస్.. చాలామంది పార్ట్ టైమ్ ఉద్యమం చేస్తున్నారు.. ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించడం లేదు, వస్తున్నారు .. పోతున్నారు.. ఫొటోలకి ఫోజులిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
కీలక ప్రాంతాల్లో కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల మంది విద్యార్థులతో ర్యాలీలు, నిరహార దీక్షలు లాంటివి చేయాలి. అంతకుముందే దామగుండం ప్రాంతంలో ప్రజలందరికి విషయం ఏంటో వివరించాలని, అప్పుడే ఉద్యమం అనేది నిర్మితమవుతుందని తెలిపారు.
అడవులతో కలిగే ప్రయోజనాలను ఈ తరానికి అర్థమయ్యే విధంగా వివరించినప్పుడే యువత ఉద్యమంలో భాగం అవుతారని చెప్పారు.
నేవీ దాదాపు అక్కడ లక్షా తోంభై వేల చెట్లను తొలగించిన వేరే ప్రాంతంలో దాదాపు 11 లక్షల మొక్కలను నాటుతామని హమీ ఇస్తున్నారని అయితే ఆ ప్రాంతం ఇప్పుడున్న దామగుండంలా ఎప్పటికీ మారదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైన అంశంపై ప్రజలు ముందుకు వచ్చి ఉద్యమం చేయనంత మాత్రానా అది నిజం కాకుండా పోదని చెబుతున్నారు.


Read More
Next Story